
మనీలా:- ఫిలిప్పీన్స్-లోని ఐలాండ్ల మధ్య ప్యాసింజర్లతో ప్రయాణించే ఓ ఫెర్రీలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా 31 మంది మరణించారు. మరికొందరు గాయపడగా.. కొందరు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో సమారు 250 మంది ప్యాసింజర్లు ఉన్నట్లు బసిలాన్ ప్రావిన్స్ గవర్నర్ జిమ్ హతమాన్ తెలిపారు. ఫెర్రీ, సౌత్ పోర్ట్ సిటీ అయిన జాంబోంగా నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో సిటీకి బయలుదేరిందని చెప్పారు. అర్ధరాత్రి బసిలాన్ ప్రావిన్స్ కు సమీపంలో దానిలో మంటలు అంటుకున్నాయని వివరించారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో చాలా మంది నీటిలోకి దూకారని వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే కోస్ట్ గార్డ్, మత్స్యకారులతో సహా ఘటనాస్థలానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని రెస్క్యూ టీమ్‌లు వెంటనే ఆస్పత్రికి తరలించాయన్నారు.
నీటిలో దూకిన వారిని తీరానికి చేర్చి ప్రాణాలు కాపాడినట్లు వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని.. ఇంకా రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఫిలిప్పీన్స్‌లో భద్రతా నిబంధనలను సరిగా అమలు చేయకపోతుండటంతో అక్కడ సముద్ర ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి.1987లో ఓ ఫెర్రీ మునిగిపోవడంతో 4,300 మందికి పైగా మరణించారు.