
చిన్న పిల్లల ఆరోగ్యం, వారి ఎదుగుదల, అభ్యసన కార్యక్రమాలపై తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ (డబ్ల్యూడీసీడబ్ల్యూ) సాంకేతికతను మరింత విస్తృతం చేస్తోంది. స్పెషల్ గా ఒక యాప్ ను (అప్లికేషన్ ) తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. సంసిద్ధ పేరిట తయారు చేసిన ఈ యాప్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇది చిన్నారుల తల్లిదండ్రులు, ప్రీ స్కూల్ నిర్వాహకులకు చాలా ఉపయోగపడుతుందంటున్నారు.
ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ) లక్ష్యంతో రూపొందించిన ఈ యాప్.. పూర్తిగా తెలుగులో ఉంటుంది. అందరికీ అర్థమయ్యేలా రూపొందించారు. వివిధ రకాల వీడియోలను సంసిద్ధ యాప్ లో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ యంత్రాంగం అప్ లోడ్ చేస్తోంది. వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
* సంసిద్ధ యాప్ లో రెండు రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. మూడేళ్లలోపు పిల్లలకు ప్రీస్కూల్ విద్యపట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు ఒక మాడ్యూల్ ఉంటాయి. ఇందులో తెలుగు, ఇంగ్లీష్, హిందీ పద్యాలు, చిన్నపాటి కథలు వినవచ్చు. వీటితో పాటు ప్రీ స్కూలు కోసం చేసిన పుస్తకాలు, పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలు, అసెస్ మెంట్ విధానాలు ఉంటాయి. ఈ యాప్ అంగన్ వాడీ టీచర్ల వద్ద ఉండనుంది.
* పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల వంటి అంశాలతో మరో యాప్ ఉంటుంది. ఈ యాప్ ను అంగన్ వాడీ టీచర్లు, సూపర్ వైజర్లే కాకుండా చిన్నారుల తల్లిదండ్రులు సైతం ఇన్ స్టాల్ చేసుకోవచ్చని చెబుతున్నారు. వచ్చే వారం సంసిద్ధ యాప్ లింకును వెబ్ సైట్ లో పెట్టనున్నారు.