- ఆందోళన చెందుతున్న చాట్‌జీపీటీ డెవలపర్, ఇండియన్ ఆరిజన్ మీరా మారుతి
- ప్రభుత్వం, రెగ్యులేటరీలు, ప్రతి ఒక్కరూ తమకు సాయం చేయాలని వెల్లడి
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ మధ్య కాలంలో బాగా గుర్తొస్తున్నపేరు.. చాట్‌జీపీటీ. ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఈ చాట్‌బాట్‌ను ఓపెన్ఏఐ అనే యూఎస్ కంపెనీ డెవలప్ చేసింది. చాట్‌జీపీటీ డెవలప్‌మెంట్‌లో ఇండియన్ ఆరిజన్ మీరా మారుతి పాత్ర కీలకంగా ఉందని చెప్పాలి. ఏఐ వాడకంపై ఆమె ఆందోళన పడుతున్నారు. ఈ టెక్నాలజీని తప్పుగా వాడుకునేవాళ్లు ఉంటారని, తప్పుడు పనులకు వాడుకునేవాళ్లు ఉంటారని మీరా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమది చిన్న గ్రూప్ అని, ప్రభుత్వం, రెగ్యులేటరీలు, ప్రతీ ఒక్కరి సాయం తమకు కావాలని కోరారు. గ్లోబల్‌గా ఏఐని ఎలా అదుపులో ఉంచాలి? మానవ విలువలను పెంచేలా ఎలా చేయాలి? అనే అంశాలు ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారాయని మీరా టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మీరా మారుతి ఎవరంటే..?
శాన్‌ఫ్రాన్సిస్కోలో 1988 లో జన్మించిన మీరా మారుతికి ఇండియాతో సంబంధాలున్నాయి. ఆమె పేరెంట్స్ ఇండియా నుంచి వెళ్లి అమెరికాలో సెటిలయ్యారు. టెస్లాలో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా ఆమె పనిచేశారు. ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని థేయర్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి పొందారు. ప్రస్తుతం ఓపెన్‌ఏఐలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.
చాట్ జీపీటీ గురించి..
చాట్‌జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఒక చాట్‌బాట్. కిందటేడాది నవంబర్‌లో చాట్‌జీపీటీని ఓపెన్‌ఏఐ లాంచ్ చేసింది. హిస్టరీ నుంచి ఫిలాసఫీ వరకు వివిధ టాపిక్‌లపై చాట్‌జీపీటీ చర్చించగలదు. టేలర్ స్విఫ్ట్ వంటి పెద్ద సింగర్ల స్టైల్‌లో లిరిక్స్ జనరేట్ చేయగలదు. అంతేకాకుండా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోడ్‌కు ఎడిట్స్ చేయడంపై సలహా ఇవ్వగలదు. ఇంటర్నెట్‌లోని వివిధ రకాల ఆర్టికల్స్, వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లపైనా, రియల్ టైమ్ కన్వర్జేషన్స్‌పైన చాట్‌జీపీటీకి ట్రెయినింగ్ ఇచ్చారు. అలా అని చాట్‌జీపీటీ అన్ని సార్లు కరెక్ట్ చెబుతుందని కాదు. ఇదే ఇచ్చే ఆన్సర్లపై నిజ నిర్ధారణ జరగలేదు. మనుషులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌పైన ఆధారపడే ఈ చాట్‌బాట్ మెరుగవుతోంది. ఈ ఏడాది జనవరిలో ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. అంతేకాకుండా తన సెర్చింజిన్ బింగ్, ఇతర ప్రొడక్ట్‌లలో ఈ చాట్‌బాట్‌ను కలిపింది.
చదువెగ్గొట్టే మార్గమే చాట్‌జీపీటీ
చాట్‌జీపీటీ యూజర్లు అడిగిన ప్రశ్నలకు టెక్స్ట్ నుంచి ఇమేజ్‌ల వరకు వివిధ రూపాల్లో సమాధానాలిస్తోంది. గత పదేళ్లలో టెక్నాలజీ సెక్టార్‌లో విప్లవం తీసుకొచ్చిన మొదటి సాఫ్ట్‌వేర్ చాట్‌జీపీటీ అని చాలా మంది రీసెర్చర్లు పేర్కొంటున్నారు. స్టూడెంట్లు తమ అసైన్‌మెంట్స్‌ను చాట్‌జీపీటీ ద్వారా చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఈ అంశంపై యూఎస్ రీసెర్చర్ నోమ్ చోమ్స్‌కీ తన అభిప్రాయాలను ఓ యూట్యూబ్ ఛానెల్‌తో పంచుకున్నారు. చాట్‌జీపీటీ ఒక హైటెక్ దొంగ అని, నేర్చుకోవడాన్ని తప్పించుకోవడానికి గల ఒక మార్గమని అన్నారు. ‘కాలేజ్ వ్యాసాలు చాలా ఏళ్ల క్రితమే కనుమరుగయ్యాయి. ప్రస్తుతం స్టూడెంట్లు టెక్నాలజీ సాయంతో తమ పేపర్లను పూర్తి చేసి ఈ--–మెయిల్‌లో పంపుతున్నారు. చాలా టెక్నాలజీల వలన మంచి, చెడు రెండూ ఉన్నాయి’ అని ఆయన అన్నారు. ‘ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టూడెంట్లను ఆకర్షించలేకపోతే, నేర్చుకోవాలనే కసి కలిగించలేకపోతే, వారిని ఛాలెంజ్ చేయలేకపోతే, స్టూడెంట్లు ఇటువంటి సిస్టమ్ నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారు’ అని అన్నారు. ఇతరుల వర్క్ కాపీ కొట్టడాన్ని ఆపడానికి చాలా యూనివర్శిటీలు చాట్‌జీపీటీ వంటి చాట్ బాట్‌లపై నిషేధం పెట్టాయి.
