సెప్టెంబర్17 చరిత్రలోకి వెళ్తే..!

సెప్టెంబర్17 చరిత్రలోకి వెళ్తే..!

తెలంగాణ ప్రజలకు ఈ రోజు ప్రత్యేకం. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన  నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న దినంసెప్టెంబర్ 17.  ఈ రోజు.. విలీన దినమా, విమోచన దినమా, స్వాతంత్య్ర దినంగా పరిగణించాలా అనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు ఎవరి అవసరాలకు తగినట్లు వారు తమకు అనుకూలంగా దీన్ని మార్చుకుంటున్నారు. తెలంగాణ  నిజాం అధీనం నుంచి స్వేచ్ఛ కల్పించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి సాయుధ పోరాటం జరిపిన కమ్యూనిస్టులు ఉనికి కోసం ఏ పేరిట జరిపినా నామ మాత్రమే అవుతుంది. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న తరం కాలం తీరిపోయి, అప్పటికి పుట్టనివారే ఇప్పుడు తెలంగాణ పోరాటాన్ని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు.

వా స్తవానికి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న అత్యధిక, అత్యల్పవర్గాల మధ్య సాంఘిక, ఆర్థికపరంగా భేదం ఉండేది కాదు. ప్రత్యేక హోదా కలిగిన వ్యక్తులు కొందరు ఈ రెండు వర్గాలలో ఉండేవారు. అయితే పాలకుడు మహమ్మదీయుడు కావడంతో ఆ వర్గానికి చెందినవారు అదొక సదుపాయంగా భావించుకునేవారు.  గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ముస్లింలు, తమ పౌరులు హిందువులతో సమానంగా వెనకబడే ఉన్నారు.  మైనారిటీ వర్గాలవారు కూడా నిజాం పాలనలో అణచివేతకు గురైనవారే. భూస్వామ్య వర్గాలకు చెందిన వారు నవాబుకు అండదండలుగా ఉండేవారు.

రజాకార్ల హింస

హైదరాబాద్ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలవనంటూ మొండికేసి హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్న చర్యలకు తోడు రజాకార్ల హింస, హైదరాబాదుపై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది.  నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పటేల్ సైన్యాన్ని రంగంలోకి దింపి  ‘ఆపరేషన్ పోలో’ నిర్వహించడంతో 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. గోడ్డాన్ ప్లాన్ అని కూడా అంటారు. మేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జె.ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుంచి హైదరాబాదును ముట్టడించింది. 1948 సెప్టెంబర్ 18న నిజాం లొంగిపోయాడు. పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. 1,373 మంది రజాకార్లు హతమయ్యారు.  మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1,647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది.

ఆపరేషన్ పోలో

తాము లొంగిపోతున్నట్లు అసఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాహీ వంశస్థుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రేడియోలో ప్రకటించడంతో వివాదం సుఖాంతమయ్యింది. నాడు పటేల్ చొరవతో  ‘ఆపరేషన్ పోలో’ నిర్వహించి 77 సంవత్సరాలు పూర్తవుతున్నది.  దేశానికి స్వాతంత్ర్యం లభించిన పదమూడు నెలల తరువాత హైదరాబాద్ రాష్ట్రం సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమయ్యింది.  రజాకార్ల  ఊచకోతలతో  పేట్రేగిపోతుంటే ఎన్నో వేలమంది ప్రాణాలు బలిదానం చేస్తే కానీ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ స్వాతంత్ర్యం లభించలేదు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన పదమూడు నెలల తరువాత హైదరాబాద్ రాష్ట్రం సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమై  వివాదం సుఖాంతమయ్యింది. ఆతని ప్రధానమంత్రి మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాయిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలీ,  రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. సెప్టెంబర్ 23న  భద్రతా సమితిలో  తన  ఫిర్యాదును నిజాం ఉపసంహరించుకున్నాడు. హైదరాబాదు భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించాడు.  తరువాత ఖాసీం రజ్వీ కొన్నాళ్ళు భారతదేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక పాకిస్తాను వెళ్ళి స్థిరపడి, అక్కడే అనామకుడిలా మరణించాడు.  మేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జె.ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి 1949 చివరివరకు పదవిలో ఉన్నాడు. 

తెలంగాణ విమోచనానికి పోరాటాలు

జమలాపురం కేశవరావు, లక్ష్మీనరసయ్య, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, చండ్ర రాజేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్, షోయబ్ ఉల్లాఖాన్, మల్లు స్వరాజ్యం,  రాంజీగోండ్,  విశ్వనాథ్ సూరి, దొడ్డి కొమరయ్య,  చాకలి ఐలమ్మ,  బెల్లం నాగయ్య, కిషన్ మోదాని తదితరులు తెలంగాణ విమోచనానికి పోరాటాలు చేశారు.  మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి తదితర పోరాటయోధులు, దాశరథి, కాళోజీల  కవితల స్ఫూర్తితో  సామాన్య ప్రజలు సైతం ఊరూవాడ నిజాంపై తిరగబడ్డారు. రజాకార్ల ఊచకోతలతో పేట్రేగిపోతుంటే ఎన్నో వేలమంది ప్రాణాలు బలిదానం చేస్తే కానీ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ స్వాతంత్ర్యం లభించలేదు. ఆ పోరాటంలో పాల్గొన్నవారి వయసు ఇప్పుడు  కనీసం 90 –- 95 సంవత్సరాలుండాలి.  అటువంటి వారెవరూ కనబడడం లేదు, వినబడడంలేదు. రెండు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో పాల్గొని త్యాగాలకు ప్రతీకగా నిలిచిన ప్రముఖుల పేర్లూ వర్తమానంలో  కనుమరుగయ్యాయి.  నేడు వారి స్మరణే కరవైంది.

ఎన్నికలలో లబ్ధికోసం..

రాజకీయ పదవుల్లో ఉన్నవారు, ఆశిస్తున్నవారు పోరాట వీరుల పేరు పక్కన పెట్టి తరుముకొస్తున్న ఎన్నికలలో లబ్ధికోసం తమ నాయకులు, వారి ఆప్తులను కీర్తించే పనిలో మునిగిపోయారు.  ఎన్నికలకు సొమ్ము సమీకరణలో కొందరు,  ఓటర్లను ఆకర్షించేందుకు ఉచితాల పేరిట పథక రచన, ప్రచారాల్లో మునిగి ఉన్నారు.  నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని ఒక వర్గం హిందూ, ముస్లింల పోరాటంగా పేర్కొనే ప్రయత్నం చేసిందని విమర్శలుండగా, నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల ఆగడాలకు అణచివేతకు గురైనవారు అన్ని మతాలకు చెందిన గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం అనే అంశం గుర్తించి విమోచన దినంగా మరికొందరు పరిగణిస్తున్నారు. భూస్వామ్య దోపిడీ ఇంకా గ్రామాల్లో కొనసాగుతునే ఉందనీ, ఇప్పటికీ వారినుంచి ప్రజలకు విమోచనం లభించలేదు కాబట్టి విలీన దినంగానే చూడాలని ఇంకొందరు అంటున్నారు.  చివరకు అందరూ కలసి విమోచన, విలీనం వాదన లేకుండా సాయుధ పోరాటాన్నే రాజకీయాలలో  నిమజ్జనం చేస్తున్నారు. 

- నందిరాజు రాధాకృష్ణ,
 సీనియర్ జర్నలిస్ట్