ఇదొక డిఫరెంట్ లవ్‌‌స్టోరీ : మాళవిక

ఇదొక డిఫరెంట్ లవ్‌‌స్టోరీ : మాళవిక

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. డీసెంట్ హీరోయిన్‌‌గా పేరు తెచ్చుకుంది మాళవిక నాయర్. నాగశౌర్యతో ‘కళ్యాణ వైభోగమే’ తర్వాత మరోసారి నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ సినిమా మార్చి 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మాళవిక ఇలా ముచ్చటించింది. 

‘‘ఇదొక డిఫరెంట్ లవ్‌‌స్టోరీ. మామూలుగా ప్రేమ కథలు రెండు మూడేళ్ళ వ్యవధిలో జరిగినట్లు చూపిస్తుంటారు. అయితే ఇందులో 18 నుంచి 28 ఏళ్ల మధ్య ప్రేమ ప్రయాణాన్ని చూపిస్తారు. మొత్తం ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్ తో ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. వయసును బట్టి నాగ శౌర్య వేరియేషన్స్ బాగా చూపించారు. నేను కూడా నా పాత్రకు పూర్తి న్యాయం చేశానని భావిస్తున్నా.  ఇప్పటిదాకా ఒక నటిగా సినిమాలు చేశాను.  కానీ ఇది అన్ని విభాగాల పరంగా నాకు దగ్గరైన సినిమా. నటిగా నేను ఎవరనేది చూపించే చిత్రమిది. అనుపమ పాత్రలో ఆకట్టుకుంటాను. సన్నివేశాలన్నీ సహజంగా నిజ జీవితంలో మనకు ఎదురైనట్లుగా ఉంటాయి. అవసరాల లాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌‌‌‌తో వర్క్ చేయడం హ్యాపీ. ఆయనకు భాషపై మంచి పట్టు, గౌరవం ఉన్నాయి. ఆయన వల్లే నాకు తెలుగు మాట్లాడటం వచ్చింది. ముద్దు సీన్‌‌లో నటించినందుకు నాకెలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అది  కథలో భాగమే తప్ప కావాలని పెట్టింది కాదు. వచ్చిన ప్రతి సినిమా చేయడంలేదు. నా మనసుకి నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తున్నా. ప్రస్తుతం అన్నీ మంచి శకునములే, డెవిల్ సినిమాల్లో నటిస్తున్నా’’.