పడుకునేంత వరకు ఫోన్‌‌‌‌లోనే 87 శాతం మందికి ఇదే అలవాటు

పడుకునేంత వరకు ఫోన్‌‌‌‌లోనే 87 శాతం మందికి ఇదే అలవాటు
  • పడుకునేంత వరకు ఫోన్‌‌‌‌లోనే
  • 87 శాతం మందికి ఇదే అలవాటు
  • పని చేస్తున్నప్పుడు నిద్రొస్తోందని 58 శాతం మంది వెల్లడి
  • 31 శాతం మందికి ఇన్​సోమ్నియా:వేక్​ ఫిట్​సర్వే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని 87 శాతం మంది పడుకునే ముందు వరకు ఫోన్ వాడుతున్నారని పరుపులు అమ్మే వేక్‌‌‌‌ఫిట్ సర్వే పేర్కొంది. సాధారణంగా రాత్రి 10 లోపు పడుకోవడం మంచిదని, కానీ హైదరాబాదీల్లో మెజార్టీ ప్రజలు (58% మంది)  రాత్రి 11 వరకు మెలుకవతోనే ఉంటున్నారని వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం,   పని చేస్తున్నప్పుడు నిద్రొస్తోందని 58% మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. కిందటేడాది విడుదల చేసిన రిపోర్ట్‌‌‌‌లో ఈ నెంబర్ 48 శాతంగా ఉంది. వేక్‌‌‌‌ఫిట్‌‌‌‌ తాజాగా గ్రేట్‌‌‌‌ ఇండియన్ స్లీప్‌‌‌‌ స్కోర్‌‌‌‌‌‌‌‌కార్డ్‌‌‌‌ (జీఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌) ఆరో ఎడిషన్‌‌‌‌ను విడుదల చేసింది. రాత్రుళ్లు లేట్‌‌‌‌గా పడుకుంటున్నా  27 శాతం మంది హైదరాబాదీలు ఉదయం 7–8 మధ్యనే లేస్తున్నారని తెలిపింది. నిద్ర కోసం నిలకడగా ఒకే షెడ్యూల్‌‌‌‌ను మెయింటైన్  చేయలేకపోతే హెల్త్‌‌‌‌కు మంచిది కాదని వెల్లడించింది. నిద్ర లేవగానే అలసటగా ఫీలవుతున్న హైదరాబాదీలు గత ఏడాది కాలంలో 33 శాతం పెరిగారని  వేక్‌‌‌‌ఫిట్ సర్వే పేర్కొంది. 


సోషల్ మీడియా ప్రభావం...


 ఈ సర్వేలో పాల్గొన్న హైదరాబాదీల్లో 37 శాతం మంది రాత్రుళ్లు త్వరగా నిద్రపోకుండా సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తున్నారని వేక్‌‌‌‌ఫిట్‌‌‌‌ వెల్లడించింది. ఎలక్ట్రానిక్ డివైజ్‌‌‌‌ల నుంచి వచ్చే బ్లూలైట్‌‌‌‌ యూజర్ల నిద్రపై,  బ్రెయిన్‌‌‌‌ యాక్టివిటీపై ప్రభావం చూపుతోందని తెలిపింది. 31 శాతం మంది హైదరాబాదీలు తమకు ఇన్‌‌‌‌సోమ్నియా (నిద్ర పట్టకపోవడం) ఉందని పేర్కొన్నారని వేక్‌‌‌‌ఫిట్ సర్వే పేర్కొంది. బెడ్లపై కాకుండా వేరు వేరు చోట్ల పడుకుంటున్నామని 41 శాతం మంది రెస్పాండెంట్లు వెల్లడించారు.  మంచి పరుపులు ఉంటే నిద్ర బాగా పడుతుందని భావించేవారు గత ఏడాది కాలంలో 18 శాతం పెరిగారని ఈ సర్వే పేర్కొంది. కాగా, ఈ సర్వే కోసం పదివేల  రెస్పాన్స్‌‌‌‌లను తీసుకున్నారు. కిందటేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య ఈ రెస్పాన్స్‌‌‌‌లు సేకరించారు.