
‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అని త్యాగరాజు తన కీర్తనలలో పలికారు. ‘తన కోపమె తన శత్రువు...’ అని సుమతీ శతకకారుడు బద్దెన పలికాడు. కోపాన్ని అగ్నితో పోల్చారు. కోపం అనే అగ్ని ప్రజ్వరిల్లిన వ్యక్తి తనను తానే దహించుకుంటాడు. కోపం కారణంగా సకలం కోల్పోయే అవకాశం హెచ్చుగా ఉంటుంది. ‘ప్రథమ కోప నివారయేత్’ అని పెద్దలు చెప్పారు.
మండుతున్న అగ్నిని నీటితో ఆర్పేసినట్లుగా, తనలో కలిగిన కోపాన్ని కూడా అదేవిధంగా అణచుకోవాలి. అలా చేయగలిగినవారిని.. గొప్ప బుద్ధి కలవారిగా ప్రశంసిస్తారు. అటువంటి వారు ధన్యులు. కోపంలో పాపం చేయని ప్రాణి కోటి భూమి మీద లేదు. మనిషికి కోపం వచ్చిన సమయంలో సత్పురుషులైన వారిని కూడా పరుషమైన మాటలతో బాధిస్తాడు. కోపం వచ్చిన మనిషి.. ...ఏది పలకాలి, ఏది పలకకూడదు అనే ఇంగిత జ్ఞానాన్ని కోల్పోతాడు. కోపం వచ్చిన సమయంలో... చేయకూడని పనులు చేస్తారు. అనకూడని మాటలు అంటారు.
కోపం కలగడానికి అనేక కారణాలు ఉంటాయి. మనసులో బాధ కలిగినపున్పడు, ఎవరైనా బెదిరించినప్పుడు, ఎవరైనా అనవసరంగా విమర్శించినప్పుడు.. ఆ చేష్టలకు ప్రతిస్పందనగా కలిగేదే కోపం. ఆ కోపం చాలా బలంగా ఉంటుంది. కోపం కలిగిన వ్యక్తికి అసౌకర్యంగానూ ఉంటుంది. అదొక ఆపుకోలేని భావోద్వేగ స్థితి. దీనిని ఆవేశం, ఆగ్రహం లేదా తీవ్రమైన ఉద్రేకంగా పెద్దలు చెబుతారు. కోపం అదుపు తప్పితే వికారాలకు దారితీస్తుంది. కాబట్టి శాంతంగా ఉండటం చాలా ముఖ్యం. కోపంలో ఇతరులను దూషించటం, దాడి చేయడం.. వంటి వికారమైన పనులు జరగవచ్చు. కాపురాలు కూలిపోయినా, హత్యలు జరిగినా, ఆత్మహత్యలు జరిగినా.. వీటన్నిటికీ అకారణమైన కోపమే కారణం.
‘ఒక పాము తన చివికిపోయిన చర్మాన్ని అంటే కుబుసాన్ని విడిచివేసినట్లు, తనలో పుట్టిన కోపాన్ని ఓర్పు చేత తొలగించుకున్నవారు ఉత్తములు...’ అని రామాయణం చెబుతోంది. కోపం నుంచి బయటపడే మార్గాలు లేకపోలేదు. ‘ఆవేశాన్ని అదుపు చేసుకోవాలి. అంటే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా తనను తాను శాంత పరచుకోవాలి ’ ప్రతిస్పందనలను నియంత్రించుకోవాలి. కోపంతో ఎదుటివారిని బాధిస్తే, చూసేవారి దృష్టిలో కూడా చులకనైపోతారని గుర్తించాలి. అందుకే నియంత్రణ అవసరం ’ శాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. తన కోపం తనకే శత్రువని, తన శాంతమే తనకు రక్ష అనే మాటలను పదేపదే మననం చేసుకోవాలి. ఇవి కొన్ని పరిష్కారాలు మాత్రమే.
దురహంకారం, అర్థలోభం, కామం, వైషమ్యం, కోపం, సోమరితనం, శత్రుత్వము.. అని ఏడు అంశాలను సప్త పాతకాలు అని చెబుతున్నారు.
దృఢమైన కోపం, ప్రవర్తనా కోపం, దీర్ఘకాలిక కోపం, విధ్వంసక కోపం, తీర్పు కోపం, అధిక కోపం, దూకుడు కోపం (అకారణంగా), ప్రతీకార కోపం, స్వీయ దుర్వినియోగ కోపం, నిశ్శబ్ద కోపం, మౌఖిక కోపం, అస్థిర కోపం అని కోపాన్ని పన్నెండు రకాలుగా చెబుతున్నారు.
ఇంకా –
కోపంగా ఉన్నప్పుడు అంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోరాదని చెబుతున్నారు. ఆ క్షణికాగ్రహంలో తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆత్మహత్యల వంటి నిర్ణయాలు ఆవేశంలోనే కలుగుతాయి. అలాగే అవతలి వ్యక్తి మీద.. కోపంతో కూడిన ఆవేశానికి లోనైతే.. హత్య చేయడానికి కూడా వెనుకాడరు.
మహాభారత యుద్ధంలో అంతటి కోపానికి లోనైనవాడు అశ్వత్థామ ఒక్కడే. అందువల్లే... నిద్రిస్తున్న ఐదుగురు ఉపపాండవులను, ఇంకా మరి కొందరిని నిర్దయగా ఊచకోత కోసేశాడు. కుమారుని ఆవేశం తెలుసు కనుకనే.. అశ్వత్థామ తన కన్నకొడుకు అయినప్పటికీ ద్రోణాచార్యుడు అన్ని విద్యలు నేర్పలేదు. పూర్తి విద్య నేర్పి ఉంటే అశ్వత్థామ ఇంకా ఎన్ని దారుణాలు చేసేవాడో.
అవసరమైన చోట కలిగే క్రోధం లేదా కోపం వలన అనర్థాలు జరగవు. అంటే అన్యాయం చూసిన సందర్భంలో వచ్చే కోపాన్ని ధర్మాగ్రహం అంటారు. రాముడు, సీత అరణ్యవాసంలో ఉన్న సమయంలో ఒక కాకి వచ్చి సీతమ్మను బాధించింది. వెంటనే రాముడు ఆ కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అక్కడ కాకి అకారణంగా సీతను బాధించడంతో రాముడు కోపానికి లోనయ్యాడు. అది ధర్మాగ్రహం. అలాగే లంకా నగరాన్ని చేరుకోవటానికి సముద్రం దాటాలి. సముద్రుడు తనకు దారి ఇవ్వకపోతే, సముద్రాన్ని ఇంకింపచేస్తానన్నాడు రాముడు. ఈ ఆగ్రహం వల్ల సత్ఫలితాలు చేకూరతాయి. ధర్మాగ్రహం వేరు. అకారణ కోపం వేరు.