తొర్రూరు, వెలుగు: మహహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో వైద్యం కోసం వచ్చిన ఓ దళిత యువతితో అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్‌ను చితకబాదారు. స్థానికుల కథనం ప్రకారం.. తొర్రూరు పట్టణంలో మహబూబాబాద్‌లో ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్‌గా పని చేసే పి.కిరణ్‌కుమార్ ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడు. శనివారం రాత్రి జ్వరంతో బాధ పడుతున్న ఓ 21 ఏళ్ల యువతి ఆసుపత్రికి వచ్చి జాయిన్ అయింది.
డాక్టర్ ఆమెకు ఇంజక్షన్ ఇచ్చిన తరువాత ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అంటూ అనుచితంగా ప్రవర్తించాడు. భయబ్రాంతులకు గురైన యువతి వెంటనే తన తల్లికి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రికి చేరుకొని డాక్టర్‌ను నిలదీశారు. ఆగ్రహంతో డాక్టర్‌ను చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
