రాముడు లేడన్న వారు ‘జైశ్రీరాం’ అంటున్నరు

రాముడు లేడన్న వారు ‘జైశ్రీరాం’ అంటున్నరు
  •  ఆర్టికల్ 370 రద్దును అడ్డుకునే యత్నం చేశారు 
  • కాంగ్రెస్​పై నరేంద్ర మోదీ ఫైర్

రేవారి/ జైపూర్: రాముడు లేడన్న వారే ఇప్పుడు ‘జైశ్రీరాం’ అని నినాదాలు చేస్తున్నారని కాంగ్రెస్  నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగకూడదని వారు కోరుకున్నారని ఆయన ఆరోపించారు. శుక్రవారం హర్యానాలోని రేవారిలో ఎయిమ్స్ తో పాటు పలు ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.  అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేడు ప్రపంచంలో భారత్  ఉన్నత శిఖరాలను అధిరోహించిందని, ప్రజల ఆశీర్వాదం వల్లే మన దేశ ఖ్యాతి పెరిగిందన్నారు. 

ఈరోజు మన దేశాన్ని ప్రపంచ దేశాలు ఇంతలా గౌరవిస్తున్నాయంటే దానికి మోదీ కారణం కాదని, ఆ ఘనత దేశ ప్రజలకే చెందుతుందన్నారు. ఆర్టికల్  370ని రద్దుచేసే ప్రక్రియలో కాంగ్రెస్  నేతలు ఎన్నో అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అయినా కూడా 2019లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టికల్  370ని రద్దుచేసి మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. ఒక కుటుంబ ప్రయోజనాలు కాపాడడమే ఆ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్  పార్టీకి ఒక కుటుంబమే దేశ ప్రజల కన్నా ఎక్కువని, తమకు మాత్రం దేశ ప్రజలే ప్రథమ ప్రాధాన్యమన్నారు.

 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిత్వం కోసం 2013 సెప్టెంబర్ లో రేవారిలోనే కార్యక్రమం నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. ‘‘ప్రధాన మంత్రి అభ్యర్థిగా నేను కొన్ని గ్యారంటీలు ఇచ్చాను. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని, ఆర్టికల్  370ని రద్దు చేస్తామని మేము హామీ ఇచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ హామీలను నెరవేర్చాం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 400 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు. ప్రజల ఆశీర్వాద బలంతో మేము అన్ని సీట్లు సాధిస్తాం” అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రజల వల్లే గత సంవత్సరం జీ20 సదస్సును దేశంలో విజయవంతంగా నిర్వహించగలిగామని ఆయన తెలిపారు. 

రూ.9770 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

రేవారిలో ఎయిమ్స్​తో పాటు అర్బన్ ట్రాన్స్ పోర్ట్, హెల్త్, రెయిల్, టూరిజం ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రూ.9,700 కోట్లతో ఆ ప్రాజెక్టులను చేపట్టబోతున్నారు. మజ్రా భాల్కి గ్రామంలోని 203 ఎకరాల్లో రూ.1650 కోట్లతో ఎయిమ్స్  రేవారిని నిర్మించనున్నారు. అలాగే రూ.5,450 కోట్లతో గురుగ్రాం మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపనచేశారు.

కుటుంబ రాజకీయాల వల్ల కాంగ్రెస్​ను వీడుతున్నరు

కుటుంబ రాజకీయాలు, బంధుప్రీతి కారణం గా నేతలు కాంగ్రెస్​ను వీడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. ‘వికసిత్  భారత్, వికసిత్  రాజస్థాన్’ పేరిట జైపూర్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆన్ లైన్​లో మాట్లాడారు. మోదీని వ్యతిరేకించడమే కాంగ్రెస్ ప్రధాన అజెండా అని, తాను చేసిన దానికి వ్యతిరేకంగా చేయడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్​పై మండిపడ్డారు. ఈ క్రమంలో దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికీ సిద్దమవుతుందన్నారు. పాజిటివ్  పాలసీలను రూపొందించేంత విజ్ఞత, దార్శనికత కాంగ్రెస్​కు లేదని ఎద్దేవా చేశారు. కాగా, జైపూర్​లో రూ.17 వేల కోట్లతో చేపట్టే పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.