చేపల వేటకు వెళ్లిన వాళ్లు మధ్యలోనే చిక్కుకుపోయారు

చేపల వేటకు వెళ్లిన వాళ్లు మధ్యలోనే చిక్కుకుపోయారు
  • మెదక్​ జిల్లా ఎల్లాపూర్ లోని మంజీరాకు వెళ్లిన ఆరుగురు 
  • రక్షించిన ఫైర్​ సిబ్బంది, గజ ఈతగాళ్లు

పాపన్నపేట, వెలుగు: చేపల వేటకు వెళ్లిన ఆరుగురు గురువారం మంజీరా నది వరద ప్రవాహంలో చిక్కుకుపోగా ఫైర్​ మెన్లు రెస్య్కూ ఆపరేషన్​ చేసి వారిని రక్షించారు. మెదక్​జిల్లా హవేలి ఘనపూర్ మండలం చౌట్లపల్లికి చెందిన బండమీది సిద్దిరాములు, బింగిరి పోచయ్య, ఔరంగాబాద్ కు చెందిన నాగరాజు, మెదక్ టౌన్​కు చెందిన కృష్ణ, యాదగిరి, కట్లె సిద్ధిరాములు కలిసి మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధి ఎల్లాపూర్ వద్ద మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లారు. ఎగువన సంగారెడ్డి జిల్లాలోని సింగూర్​ప్రాజెక్ట్​ నుంచి నీటిని విడుదల చేసిన విషయం తెలియక వారు నది మధ్యలో ఉన్నగడ్డ మీద నిలబడి చేపలు పడుతున్నారు.

ఇంతలో నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో వారు మధ్యోలోనే చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ సైదులు, రూరల్ సీఐ విజయ్​కుమార్, పాపన్నపేట మండల ఇన్​చార్జి తహసీల్దార్​ మహేందర్, మెదక్  స్టేషన్​ఫైర్ ఆఫీసర్​అమర్నాథ్​ గౌడ్​ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లయిన బోల దుర్గయ్య, నీరుడి సత్తయ్యలను కూడా అక్కడికి పిలిపించారు. ఫైర్​మెన్లు శ్రీకాంత్​, ప్రశాంత్​, నవీన్, వెంకటేశ్వర్లు, గజ ఈతగాళ్లు కలిసి దాదాపు గంటసేపు రెస్య్కూ ఆపరేషన్​నిర్వహించారు. మధ్యలో చిక్కుకున్న వారి దగ్గరకు తాడును కట్టి ఒడ్డుకు 
సురక్షితంగా చేర్చారు.