దోచుకున్న వేల కోట్లు వాపస్ తీసుకువస్తాం

దోచుకున్న వేల కోట్లు వాపస్ తీసుకువస్తాం
  • బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ ఎస్  ప్రవీణ్ కుమార్

హనుమకొండ: రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్సీ, బీసీ, అగ్రవర్ణాల్లో పేదలు రాజ్యమేలబోతున్నారు.. అక్రమంగా దోచుకున్న వేల కోట్ల ప్రజాధనాన్ని  వాపస్ తీసుకువస్తామని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ ఎస్  ప్రవీణ్ కుమార్ అన్నారు. హనుమకొండలో బహుజన సమాజ్ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి  హాజరైన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వివిధ పార్టీలనుంచి వచ్చిన కార్యకర్తలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మనం బాబా సాహెబ్ వారసులమని, కాన్షీరామ్ ఆశీస్సులతో పెరుగుతున్నామన్నారు. మా రక్తంలో మాట తిప్పే, మడమ తిప్పే లక్షణం లేదు. అంతేకాదు అమ్ముడు పోయే లక్షణం లేదు.. అమ్మే లక్షణం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.   
మోసపోయింది...అవమాన పడింది చాలు...మనమే పాలకులం కావాలి
ఇప్పటి వరకు మోసపోయింది, అవమాన పడింది చాలు.. ఇకపై మనమే పాలకులం కావాలని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ ఉత్తేజం, ఉత్సాహం మీ వరకే పరిమితం కావద్దు, ఇంటింటికీ తిరగి ప్రచారం చేయండి, బహుజన వాదాన్ని ప్రచారం చేయండి, ఏనుగు గుర్తును గెలిపించాలని కోరండి అని పిలుపునిచ్చారు. రెండేళ్ల లొనే ఇది నిజం చేయాలని ఆయన సూచించారు. మన భవిష్యత్ ను మనమే నిర్ణయించుకోవాలని కట్టుబడండి, ఇంటింటికి వాడ వాడకు తిరగండి, బహుజన వాదాన్ని ప్రచారం చేయండి, అంతవరకు నిద్ర పోవద్దు అని ప్రవీణ్ కుమార్ సూచించారు. ఇదే జిల్లాలో ఓ ఎమ్మెల్యే మనకు పొట్ట కోస్తే చదవురాని వారని చెప్పాడు, అలాంటి వారికి ఏనుగు గుర్తుతో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.