భూకంపం నుంచి బయటపడ్డరు.. కానీ అగ్నిప్రమాదంలో సజీవదహనం

భూకంపం నుంచి బయటపడ్డరు.. కానీ అగ్నిప్రమాదంలో సజీవదహనం

ఇస్తాంబుల్ : టర్కీలో ఈ నెల 6న సంభవించిన పెను భూకంపంలో వేలాది మంది చనిపోయారు.. లక్కీగా ఓ సిరియా కుటుంబం మాత్రం ప్రాణాలతో బయటపడింది. నగరం వదిలిపెట్టి మరో నగరంలోని బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందింది. వారం కూడా గడిచిందో లేదో.. ఆ ఇంట్లో మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు మొత్తం సజీవ దహనమయ్యారు. భూకంపం నుంచి తప్పించుకున్నా అగ్నిప్రమాదానికి అంతా బలయ్యారు. టర్కీలోని కోన్యా సిటీలో చోటుచేసుకుందీ దారుణం.

ఆశ్రయం కోరి వెళ్లి అగ్ని ప్రమాదంలో..

2011లో సిరియాలో యుద్ధం ప్రారంభం కావడంతో వేలాదిమంది సిరియన్లు కుటుంబాలతో సహా టర్కీకి వలస వెళ్లారు. అలా వచ్చిన సిరియన్ కుటుంబం ఒకటి నుర్దాగి సిటీలో నివసిస్తోంది. ఈ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ నెల 6న టర్కీని పెను భూకంపం వణికించింది. నుర్దాగి సిటీపైనా భూకంప ప్రభావం భారీగానే ఉంది. అయితే, ఈ కుటుంబం మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకుంది. తాముంటున్న ఇల్లు కూలిపోవడంతో కోన్యా సిటీలో ఉంటున్న తమ బంధువుల దగ్గర ఆశ్రయం పొందింది. బంధువుల కుటుంబంలోని ఏడుగురు కుటుంబ సభ్యులతో ఈ కుటుంబం కూడా తలదాచుకుంటోంది. నాలుగు రోజులు గడిచిన తర్వాత ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటికి నిప్పంటుకోవడంతో బయటకు వచ్చే వీలులేక ఆశ్రయం కోసం వచ్చిన కుటుంబ సభ్యులు మంటల్లో కాలిపోయారు. భార్యాభర్తలతో పాటు ఐదుగురు పిల్లలు.. మొత్తం ఏడుగురు చనిపోయారు. ఈ కుటుంబానికి ఆశ్రయమిచ్చిన వారి కుటుంబం కూడా ఈ అగ్నిప్రమాదంలో గాయపడింది.