హెచ్ఎండీఏ స్థలంలో వెలసిన గుడిసెలు

హెచ్ఎండీఏ స్థలంలో వెలసిన గుడిసెలు
  • తొలగించేందుకు అధికారులు, పోలీసుల యత్నం 
  • ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉద్రిక్తత

మియాపూర్, వెలుగు : హెచ్ఎండీఏ భూమిలో వేలాది మంది గుడిసెలు వేయగా.. తొలగించేందుకు అధికారులు, పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొంది. శేరి లింగంపల్లి మండలం మియాపూర్​ పరిధి సర్వే నంబర్లు100,101లో హెచ్ఎండీఏ భూమి ఉంది. ఇక్కడ ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇస్తున్నారనే ప్రచారంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. దాదాపు 2 వేల మంది వరకు గుడిసెలు వేసుకుంటూ  3, 4 రోజులుగా అక్కడే ఉంటున్నారు. శుక్రవారం ఉదయం హెచ్ఎం డీఏ అధికారులు మియాపూర్​ పోలీసులతో కలిసి వెళ్లారు.  

ముందుగా ప్రజలతో మాట్లాడేందుకు ప్రయత్నించారు.  దీంతో తమకు ఇండ్ల స్థలాలు ఇచ్చేవరకు కదిలేది లేదని బైఠాయించారు. సాయంత్రం వరకు అధికారులు, పోలీసులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. మియాపూర్​ఏసీపీ నర్సింహారావు వెళ్లి గుడిసెలు వేసిన వారితో మాట్లాడారు. ఆ స్థలంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుందని, ప్రస్తుతం ఇది హెచ్​ఎండీఏ అధీనంలో ఉందని సూచించారు. స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయినా అక్రమణదారులు తగ్గకుండా స్థలాలు ఇచ్చేవరకు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. 

దీంతో పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయగా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.  తమకు  ఇండ్ల స్థలాలు కేటాయించాలని శుక్రవారం వందల సంఖ్యలో మహిళలు శేరిలింగంపల్లి తహశీల్దార్ ఆఫీసును ముట్టడించారు.   దీప్తిశ్రీనగర్​ నుంచి తహసీల్దార్​ ఆఫీసు వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.