రాజస్తాన్‌‌లో 150 కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత

రాజస్తాన్‌‌లో 150 కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత
  • కారు సీజ్.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

జైపూర్: రాజస్తాన్‌‌లోని టోంక్‌‌లో  పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. న్యూఇయర్ సందర్భంగా పోలీసులు బుధవారం బరోని ఏరియాలో తనిఖీలు చేపట్టారు. ఓ కారుని ఆపి సోదా చేయగా..అందులో 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ దొరికింది. దాంతోపాటు 200 పేలుడు కార్ట్రిడ్జ్‌‌లు (బ్యాటరీలు లేదా డిటోనేటర్లు), 6 బండిల్స్ సేఫ్టీ ఫ్యూజ్ వైర్ (సుమారు 1,100 మీటర్లు) కూడా లభ్యమయ్యాయి. కారుతోపాటు పేలుడు పదార్థాలన్నింటినీ సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. యూరియా బస్తాల చాటున ఈ పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్టు తెలిపారు. 

ఈ ఘటనలో  సురేంద్ర మోచి, సురేంద్ర పట్వా  అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితులు ఈ పేలుడు పదార్థాలను బుండి నుంచి టోంక్‌‌కు తీసుకెళ్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. వీటిని ఎందుకు తరలిస్తున్నారనే విషయంపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు. అమ్మోనియం నైట్రేట్ ఎరువుగా ఉపయోగించేదే అయినప్పటికీ, కొందరు దాన్ని పేలుడు పదార్థంగా వాడుతున్నారు. ఇటీవల ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడులో (నవంబర్ 10న)  నిందితులు ఈ పదార్థాన్నే ఉపయోగించారు.