పొంచి ఉన్న నిప్పు ముప్పు

పొంచి ఉన్న నిప్పు ముప్పు

‘అగ్నిప్రమాదాల నివారణ చర్యలు చేపడదాం. దేశ సంపదను కాపాడదాం’ అనే నినాదంతో ఈ ఏడాది అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇండ్లతో పాటు కార్యాలయాలు, పరిశ్రమల్లో అగ్ని నివారణ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మాక్ డ్రిల్​తో పాటు,  ప్రమాదాల నివారణ, అవగాహన అవసరాలపై కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని,  ప్రజల్లో చైతన్యం కలిగించాలని నిర్ణయం తీసుకున్నారు.

సూర్యుడు నిప్పులు చిమ్ముకుంటూ చెలరేగిపోతున్న వేళ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టేలోపున ప్రమాద  ఘంటికలు  మోగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. అప్పటికే పరిస్థితి చేయి దాటితే  ప్రథమ చికిత్స చేయడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఈ విషయాల్లో జోక్యం చేసుకుని తగిన అవగాహన కల్పించడాన్ని అధికారులు విధిగా భావించాలి. అగ్నిమాపకశాఖ అధికారులు అవసరమైతే సామాజిక మాధ్యమాల సాయం తీసుకోవాలి.

లెక్కకు మించి అగ్నిప్రమాదాలు

పరిశ్రమల్లో, వాణిజ్య సముదాయాల్లో, అపార్టుమెంట్లలోనూ అగ్ని ప్రమాదాలు లెక్కకు మించి చోటుచేసుకుంటున్నాయి. అనుకోని  ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం కోసం అప్పటికప్పుడు వెతుకులాట పెను నష్టాన్ని మిగులుస్తోంది.  ప్రమాద సమయంలో వ్యూహాత్మకంగా తప్పించుకోగలిగే మనోధైర్యం ఉండాలి. ఇందుకు కొంత అవగాహన అవసరం అని అంటున్నారు అధికారులు.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 వరకూ మూడు వేలకు పైగా ఫైర్ కాల్స్ నమోదైనట్లు అగ్నిమాపక శాఖ వెల్లడించింది. ఇంచుమించు సగ భాగం ప్రమాదాలు రాజధాని పరిధిలోనే  జరిగాయి. ఇటీవలి కాలంలో ఫిల్మ్ ఛాంబర్,  కాటేదాన్ బిస్కెట్ ఫ్యాక్టరీ,  మల్కాజిగిరిలోని ఆయిల్ గోడౌన్, చార్మినార్ యునాని ఆస్పత్రి సమీపంలోని గండిపేట కార్ల గోదాముల్లో మంటలు చెలరేగాయి.  హైదరాబాద్ జంట నగరాల్లో అగ్ని ప్రమాదాలు ఏటా కలవర పెడుతున్నాయి. ఒకదాని వెంట మరొకటి చోటు చేసుకుంటూ విషాదాన్ని మిగులుస్తున్నాయి. భారీ స్థాయిలో నష్టం తప్పడం లేదు. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీ,  మండే స్వభావం ఉన్న పదార్థాలు....ఇలా కారణాలు అనేకం ఉన్నప్పటికీ అనంతర పరిణామాలు భయానకంగా ఉంటున్నాయి.  జీహెచ్ఎంసి పరిధిలో 30 కి పైగా అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. జంటనగరాల్లో ఈ లెక్క 18గా ఉంది. ప్రతి కేంద్రం వద్ద 25 వేల లీటర్ల సంపు ఉండాలి. స్థలాభావం వల్ల చాలా చోట్ల ఈ సదుపాయం అందుబాటులో లేదు.

జనావాసాల్లోనే రసాయన గోడౌన్లు

జనావాసాల్లోనే రసాయన గోడౌన్లను నిర్వహిస్తున్నా అధికారులు  పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఇండ్ల మధ్య ఉన్న రసాయన నిల్వలను తనిఖీ చేయాలన్న ఆలోచనను ఆచరణలో పెట్టడానికి కనీస ప్రయత్నం చేయడం లేదు. ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోక పోవడం ఘోర ప్రమాదాలకు కారణం అవుతోంది. గత ఏడాది నవంబర్లో నాంపల్లి బజార్ ఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో సామాన్యులే బలైపోయారు. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది పూర్తిగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. జనావాసాల్లో ఇలాంటి రసాయనాలను నిల్వ ఉంచడం నిషేధం. గత ఏడాది జులైలో  మేడ్చల్ జిల్లా బాలానగర్​లోని పది అంతస్తుల అపార్ట్ మెంట్​లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఎనిమిదో అంతస్తులో మంటలు అంటుకుని మిగతా ఫ్లాట్లకు వేగంగా వ్యాపించాయి. ఇప్పటికే  రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది.  వడగాలులు వీస్తున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 45  డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. 

ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

వేసవిలో విద్యుదాఘాతంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  కార్యాలయాలు, బహుళ అంతస్తుల భవనాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులు సెల్లార్లలో రసాయనాలు, గ్యాస్ బండలు నిల్వ చేయకుండా అధికారులు తనిఖీలు నిర్వహించాలి. ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర ద్వారాల నుంచి బయటకు వెళ్లే మార్గాల గురించి ముందస్తు చర్యలు  తీసుకోవాలి.  ఎక్కడ మంటలు వ్యాపించినా ఆ ప్రదేశాన్ని వదిలి వెంటనే వెళ్లాలి.  నివాస గృహాలు, వాణిజ్య భవనాల్లో ప్రమాదం జరిగితే మంటలు అదుపు చేయడానికి సర్వశక్తులూ ఒడ్డి పోరాటం చేయాల్సి వస్తోంది. మంటలు అదుపు చేయడం కష్టతరమవుతోంది.  పొగలో, అగ్నికీలల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో కాపాడగలమన్న భరోసా కనిపించడం లేదు. ఈ తరహా ప్రమాదాలు క్షణాల్లోనే ముగిసిపోయి భయం ఆవరిస్తోంది.  వంట చేసే సమయంలో మహిళలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.  అజాగ్రత్త నిర్లక్ష్యం వంటివి భారీ నష్టానికి కారణమవుతాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకూ..అంటే నాలుగు నెలల వ్యవధిలో తెలంగాణలో 2,550 అగ్నిప్రమాదాలు సంభవించాయి. అగ్ని మాపక కేంద్రాల వద్ద, భారీ షాపింగ్ కాంప్లెక్స్ పరిసరాల్లోనూ మాక్ డ్రిల్స్ కొనసాగిస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాలు దూరం అవుతాయన్న విషయాన్ని అవగతం చేసుకోవాలని అధికారులు తెలిపారు.

పారిశ్రామిక వాడల్లో విపత్తులు

అనూహ్యంగా పారిశ్రామిక వాడల్లో విపత్తులు సంభవిస్తున్నాయి. తెలంగాణాలో  ఏటా ఏడు నుంచి ఎనిమిది వేల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాణిజ్య, వ్యాపార సంస్థలతో పాటు పరిశ్రమలు విస్తరించడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్ లో  గత నెల చివర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఫుడ్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు అంటుకుని మూడు అంతస్తులకు వ్యాపించాయి. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో సిబ్బంది అప్రమత్తమై బయటకు రావడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. మార్చి ప్రథమార్థంలో వరంగల్ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెరువు కొమ్ము తండాలో రెండు ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సామాన్లు, నిత్యావసర వస్తువులు కాలి బూడిద య్యాయి. నాచారం పారిశ్రామికవాడలోని ఓ రసాయన తయారీ కర్మాగారంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగింది.  రాత్రి సమయం కావడం, కర్మాగారంలో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

- జి. యోగేశ్వరరావు, సీనియర్​ జర్నలిస్టు