రాజ్యసభకు ముగ్గురు ఏకగ్రీవమే

రాజ్యసభకు ముగ్గురు ఏకగ్రీవమే
  •  కాంగ్రెస్ నుంచి రేణుక, అనిల్..బీఆర్ఎస్ నుంచి రవిచంద్రనామినేషన్ 
  • నామినేషన్లకు ముగిసిన గడువు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం కానున్నాయి. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియగా.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్.. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు వేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డికి తమ నామినేషన్ పేపర్లను అందజేశారు. వద్దిరాజు రవిచంద్ర రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్టు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా కాంగ్రెస్ కు రెండు, బీఆర్ఎస్ కు ఒక సీటు దక్కనుంది. ఈ మేరకే రెండు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఈ నెల 20న ఈసీప్రకటించనుంది

బీఫామ్స్ ఇచ్చిన రేవంత్.. 

కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లకు గురువారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఫామ్స్ అందజేశారు. నామినేషన్ల కార్యక్రమాల్లో సీఎం రేవంత్, కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ తరఫున వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేయగా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రవిచంద్ర తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా గన్ పార్క్ కు చేరుకొని 
అమరవీరులకు నివాళులర్పించారు. 

ఇండిపెండెంట్ల నామినేషన్లు.. 

రాజ్యసభ సీట్లకు శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఒక అభ్యర్థి నామినేషన్ కు 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉండగా.. వీరికి ఎమ్మెల్యేలు సంతకాలు చేయకపోవడంతో నామినేషన్లు రిజెక్ట్ కానున్నాయి. శుక్రవారం నామినేషన్లను పరిశీలించనున్నారు.