
- ముగ్గురు అరెస్ట్, పరారీలో సబ్‌రిజిస్ట్రార్
ఆదిలాబాద్, వెలుగు : నకిలీ పత్రాలతో ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ముగ్గురు వ్యక్తులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మావల సీఐ కర్ర స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌కు చెందిన మిల్లింద్ కొర్తల్వార్ అనే వ్యక్తి దస్నాపూర్‌లోని 29/సీ సర్వే నంబర్‌లో ఉన్న తన ఏడు ప్లాట్లను ముగ్గురు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన మావల సీఐ విచారణ చేపట్టగా... 2011లో మిల్లింద్ కొనుగోలు చేసిన ప్లాట్లను.. 2024లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ నాలం వెంకటరమణ, రిమ్స్ ఆయూష్ విభాగం ఉద్యోగి సంజీవ్‌కుమార్, మాజీ కౌన్సిలర్ రఘుపతి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇందుకు ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ అశోక్‌కు రూ. 7 లక్షలు ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో వెంకటరమణ, సంజీవ్‌కుమార్, రఘుపతిని అరెస్ట్ చేయగా.. సబ్ రిజిస్ట్రార్ అశోక్ పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు.