ఉద్దెమర్రి దోపిడీ కేసులో ముగ్గురి అరెస్ట్

ఉద్దెమర్రి దోపిడీ కేసులో ముగ్గురి అరెస్ట్

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా ఉద్దేమర్రిలో వైన్స్ షాప్ సిబ్బందిపై దాడి చేసి క్యాష్ ఎత్తుకెళ్లడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపి కలకలం రేపిన నలుగురు సభ్యుల గ్యాంగ్ లో ముగ్గురిని శామీర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం శామీర్ పేట పీఎస్ లో మేడ్చల్ డీసీపీ సందీప్ రావు వివరాలు వెల్లడించారు. గత నెల 23న ఉద్దేమర్రిలో దోపిడీ దొంగలు ఓ వైన్స్ షాప్ సిబ్బందిపై దాడి చేసి తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి రూ.2లక్షలతో పరారైన సంగతి తెలిసిందే. బాధితుల కంప్లయింట్ తో  కేసు ఫైల్ చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గతంలో కరెంట్లు వైర్లు చోరీ చేసిన నిందితులే ఉద్దేమర్రిలో ఈ దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ గ్యాంగ్ ఈ దోపిడీ చేసినట్లు గుర్తించారు. చోరీ అనంతరం ప్రధాన నిందితుడు నసీర్ రాజస్థాన్​కు పారిపోయినట్లు గుర్తించి.. అక్కడకు వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో నసీర్​ను అదుపులోకి తీసుకున్నారు. నసీర్​ఇచ్చిన సమాచారంతో శామీర్​పేటలోని తూంకుంటలో ఉంటున్న మరో ఇద్దరు నిందితులు మహ్మద్​ఖాన్​, మహ్మద్​తారీఫ్​ను అరెస్టు చేశారు. మరో నిందితుడు ఆరీఫ్ ఖాన్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.30 వేల క్యాష్​, తుపాకీ, బైక్ స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్​కు తరలించామని డీసీపీ తెలిపారు.