ముగ్గురు బీజేపీ కార్యకర్తలను చంపిన ఉగ్రవాదులు .. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

ముగ్గురు బీజేపీ కార్యకర్తలను చంపిన ఉగ్రవాదులు .. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మరణించారు. కుల్గాం జిల్లాలోని వైకే పోరా ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న యువజన నాయకులపై ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. ఈ కాల్పుల్లో స్థానిక యువజన వింగ్ నాయకుడితో సహా ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందారు. ‘వైకే పోరాలో ఉగ్రవాద దాడి జరిగినట్లు గురువారం రాత్రి 8 గంటల 20 నిమిషాలకు మాకు సమాచారం అందింది. వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు క్రైమ్ స్పాట్ వద్దకు చేరుకున్నారు. కాల్పులకు గురైన వారిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు’ అని పోలీసులు తెలిపారు.

మరణించిన వారిని కుల్గాం జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి ఫిదా హుస్సెన్ యాటూ, ఉమర్ రషీద్ బేగ్, ఉమర్ రంజాన్ హజాంగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని మొత్తం జల్లెడపడుతున్నారు. గత కొన్ని నెలలుగా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు మరణించారు.

జూలైలో బీజేపీ నాయకుడు షేక్ వసీం, అతని తండ్రి మరియు సోదరుడు బండిపోరాలో ఉగ్రవాదుల చేత చంపబడ్డారు. ఆ తర్వాత ఒక వ్యవధిలోనే కుల్గాంలో బీజేపీకి చెందిన ఒక సర్పంచ్ కాల్చి చంపబడ్డాడు.

ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మా యువ కార్యకర్తల్లో ముగ్గురిని చంపడాన్ని నేను ఖండిస్తున్నాను. వారు జమ్మూకశ్మీర్‌లో అద్భుతంగా పని చేస్తున్న యువకార్యకర్తలు. వారి కుటుంబాలకు బీజేపీ అన్నివేలలా అండగా ఉంటుంది. మరణించిన వారి ఆత్మలకు ప్రశాంతత లభించాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఓమర్ అబ్దుల్లా ఈ దాడిని ఖండించారు. ‘దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను హత్య చేయడాన్ని నేను నిస్సందేహంగా ఖండిస్తున్నాను. అల్లా వారికి స్వర్గంలో చోటు కల్పిస్తాడు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబాలకు మేం అండగా ఉంటాం’అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ ఉగ్రదాడిపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కూడా స్పందించి ట్వీట్ చేశారు. ‘కుల్గాంలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైనందకు చాలా బాధగా ఉంది. వారి కుటుంబాలకు మా సంతాపం తెలియజేస్తున్నాం. మొత్తానికి చివరగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క చెడు ఆలోచనా విధానాల వల్ల జమ్మూకశ్మీర్ ప్రజలు తమ జీవితాలను చెల్లించాల్సి వస్తోంది’ అని ఆమె ట్వీట్ చేశారు.

For More News..

14 ఏళ్లకే గర్భం.. సీక్రెట్‌గా డెలివరీ.. పేరెంట్స్‌కు భయపడి శిశువును ఫ్రీజర్‌లో దాచిన బాలిక

రాష్ట్రంలో మరో 1,531 కరోనా కేసులు

రాష్ట్రంలో వైద్యుల కొరత.. 7వేల మందికి ఒక్కడే డాక్టర్