ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి.. నాగర్​కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లిలో విషాదం

ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి.. నాగర్​కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లిలో విషాదం

కోడేరు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో గురువారం సాయంత్రం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు -నీటిలో మునిగి మృతి చెందారు. చనిపోయిన చిన్నారులను గణేశ్ రెడ్డి(13), రక్షిత(10),  శ్రవణ్(7)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్​లోని బండ్లగూడ సరస్వతి శిశు మందిర్ లో గణేశ్ రెడ్డి ఏడో తరగతి, రక్షిత ఐదో తరగతి చదువుతున్నారు. శ్రవణ్, పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు ఇవ్వడంతో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన గణేశ్, రక్షిత.. శ్రవణ్ తో కలిసి దగ్గరలోని పోతినేని చెరువులో ఈతకు వెళ్లారు.

చెరువులోని లోతైన భాగంలో చిక్కుకుని ముగ్గురు నీటిలో మునిగి చనిపోయారు. అక్కడే గేదెలను మేపుతున్న బాలుడు గమనించి రైతులకు సమాచారం ఇచ్చాడు. వారు వెళ్లి చూడగా గణేశ్, రక్షిత, శ్రవణ్ చనిపోయి ఉన్నారు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, చిన్నారుల డెడ్​బాడీలను బయటకు తీయించారు. కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గణేశ్, రక్షిత ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. శ్రవణ్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.