డ్రగ్స్ తో పట్టుపడ్డ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు

డ్రగ్స్ తో పట్టుపడ్డ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు

గుంటూరు: ఒకవైపు డ్రగ్స్ కేసుతో సినీ ప్రముఖులు కిందా మిందా అవుతుంటే.. భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ తో పట్టుపడ్డారు. విశ్వసనీయ సమాచారంతో గుంటూరు శివార్లలో గడ్డిపాడు ఇన్నర్ రింగు రోడ్డులో పోలీసులు జరిపిన తనిఖీల్లో ముగ్గురు విద్యార్థుల వద్ద సింథటిక్ డ్రగ్స్ దొరికాయి. ఈ ముగ్గురు బీటెక్ చదువుతున్నట్లు గుర్తించారు. వారి వద్ద 25 ట్రమడాల్ మాత్రలు, 25 గ్రాముల ఎల్ఎస్డీ,7 గ్రాముల ఎండీఎంఏ మత్తు మందు దొరికింది. డ్రగ్స్ ను వారు వాడడమే కాదు ఇతరులకు అమ్ముతున్నట్లు తేలడంతో వారి వద్ద రూ.24,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
నిందితులను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. పట్టుపడిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో సింథటిక్ మత్తు మందు తెప్పించుకుని తమలాంటి వారికి అమ్మి తమ వ్యసనాలకు డబ్బు కూడగడుతున్నట్లు తేలిందన్నారు. ఈ డ్రగ్స్ రాకెట్ లో ఇంకా ఎవరెవరున్నారనేది విచారిస్తున్నామని, ఇంకా ఎవరైనా ఉంటే వారందర్నీ పట్టుకుంటామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచకపోతే వ్యవసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.