ఒక్కరోజే మూడు చోట్ల  అగ్ని ప్రమాదాలు

ఒక్కరోజే మూడు చోట్ల  అగ్ని ప్రమాదాలు
  •     అబిడ్స్ ట్రూప్ బజార్ ఎల్ఈడీ లైట్ హౌజ్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు
  •     6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
  •     బాలానగర్, గండిపేటలోనూ ఫైర్ యాక్సిడెంట్లు

అబిడ్స్/మూసాపేట/గండిపేట, వెలుగు: గ్రేటర్ పరిధిలో శనివారం ఒక్కరోజే మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. అయితే, ఈ ఘటనల్లో ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.  అబిడ్స్ ట్రూప్ బజార్​లో ఫీర్డౌస్ మాల్ మూడంతస్తుల్లో ఉంది. మొదటి ఫ్లోర్​లో సంజయ్ అనే వ్యక్తికి చెందిన ఎల్ఈడీ లైట్ హౌస్ షోరూం ఉంది. రెండో ఫ్లోర్​లో షోరూంకు చెందిన గోడౌన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, 3వ అంతస్తులో ఎలక్ట్రిక్ బల్బుల షాపులున్నాయి. శనివారం బిల్డింగ్​లోని షాపులన్నీ మూసి ఉన్నాయి.  మధ్యాహ్నం 1.30 గంటలకు సెకండ్ ఫ్లోర్​లోని గోడౌన్​లో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించడంతో మిగతా వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే గౌలిగూడ ఫైర్ స్టేషన్, సుల్తాన్ బజార్ పోలీసులకు సమాచారం అందించారు.  ఫైర్ సిబ్బంది 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

గోడౌన్ షట్టర్ మూసి ఉండటంతో మంటలను అదుపు చేయడం వారికి కష్టంగా మారింది. షట్టర్​ను తెరిచి సుమారు 6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్(డీఎఫ్ వో) శ్రీనివాస్ తెలిపారు. సుమారు 5 ఫైరింజన్లు, 20 మంది సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్​లో పాల్గొన్నట్లు ఆయన వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేరని.. మూడో ఫ్లోర్​లో వాచ్​మన్ కుటుంబం ఉండగా.. వారిని సేఫ్​గా బయటికి తీసుకొచ్చామన్నారు. గోడౌన్​లో కరెంట్ వైరింగ్ సరిగా లేదని.. దానివల్లే షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగినట్లు ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన గోడౌన్​లోని లైట్లు పూర్తిగా కాలిపోయాయని.. సుమారు 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు డీఎఫ్​వో శ్రీనివాస్ తెలిపారు. బిల్డింగ్​కు ఫైర్ సేఫ్టీ లేదని.. ఓనర్​కు నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ఏరియాలో చాలా బిల్డింగ్​లకు ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని.. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో.. 

బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఎంటీఏఆర్ మెషీన్ టూల్స్ కంపెనీలో నిల్వ ఉంచిన జిర్కోనియం మెటల్​కు మంటలు అంటుకుని అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే కంపెనీలోని సామగ్రి కాలిపోయింది. అధిక ఉష్ణోగ్రత లేదా షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.   

ల్యాప్​టాప్ ప్యాకింగ్ ఆఫీసులో..

గండిపేటలోని యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ 4వ అంతస్తులో ల్యాప్​టాప్ ప్యాకింగ్ ఆఫీసు ఉంది. శనివారం ఆఫీసులో నుంచి మంటలు రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మంటలు బ్యాంక్ లోపలికి వ్యాపించకుండా నార్సింగి పోలీసులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదంలో ల్యాప్ టాప్​లు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.