డ్రగ్స్‌ కేసులో ముగ్గురు స్టూడెంట్స్‌ అరెస్ట్‌

డ్రగ్స్‌ కేసులో ముగ్గురు స్టూడెంట్స్‌ అరెస్ట్‌
  • నిందితుల నుంచి 110 ఎమ్‌డీఎమ్‌ఏ పిల్స్‌ స్వాధీనం
  • డార్క్‌ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోళ్లు, యాప్​ నుంచి అమ్మకాలు
  • మెహిదీపట్నంలో కస్టమర్ల కోసం వెయిట్‌ చేస్తుండగా అదుపులోకి
  • వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: డ్రగ్స్‌‌ సప్లయ్‌‌ చేస్తున్న ముగ్గురు స్టూడెంట్లను సిటీ వెస్ట్‌‌ జోన్‌‌ పోలీసులు గురువారం అరెస్ట్‌‌ చేశారు. నిందితుల నుంచి 110 మిథలీన్‌‌ డియాక్సీ మిథాంఫెటమీన్‌‌ (ఎమ్‌‌డీఎమ్‌‌ఏ) పిల్స్‌‌ స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిగా సాగుతున్న ఈ డ్రగ్స్‌‌ దందా వివరాలను సీపీ అంజనీకుమార్‌‌‌‌ మీడియాకు వివరించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌‌నగర్‌‌ ఆర్టీసీ కాలనీ‌‌కి చెందిన ధరావత్‌‌ సాయిచరణ్‌‌ (25) ఇంజనీరింగ్‌‌​పూర్తి చేశాడు. గంజాయి, డ్రగ్స్‌‌కు అలవాటుపడ్డ అతడు స్మగ్లర్ల నెట్‌‌వర్క్‌‌లో చిక్కి పెడ్లర్‌‌‌‌గా మారాడు. డార్క్‌‌ వెబ్‌‌సైట్ల నుంచి ఎమ్‌‌డీఎమ్‌‌ఏ, హెరాయిన్, కొకైన్‌‌ లాంటివి కొనుగోలు చేసి కాలేజ్‌‌ స్టూడెంట్స్, లిక్కర్‌‌‌‌కు బానిసలైన వారికి అమ్మేవాడు. ఒక్కో ఎమ్‌‌డీఎమ్‌‌ఏ పిల్ రూ.1,500లకు కొనుగోలు చేసి, డిమాండ్‌‌ను బట్టి రూ.2,500లకు పైగా విక్రయించేవాడు. ఇందుకోసం అమీర్‌‌‌‌పేట్‌‌కు చెందిన బీబీఏ స్టూడెంట్‌‌ రాచర్ల అంకిత్‌‌ (22), రామచంద్రాపురం ఎమ్‌‌ఏసీ సొసైటీకి చెందిన బీటెక్ స్టూడెంట్‌‌ బెల్లి అజయ్ సాయి (22)లతో కలిసి డ్రగ్స్‌‌ సప్లయ్‌‌ చేసేవాడు. వీకెండ్‌‌ పార్టీలు, బర్త్‌‌డే సెలబ్రేషన్స్‌‌లో లిక్కర్‌‌‌‌కి బదులు డ్రగ్స్ తీసుకునేందుకు ఫ్రెండ్స్‌‌తో కలిసి చైన్ సిస్టమ్‌‌లో ఎమ్‌‌డీఎమ్‌‌ఏ పిల్స్‌‌ను అమ్మేవాడు. 

యాప్‌‌తో ఆర్డర్స్, పేమెంట్స్‌‌ 

ఈ ముగ్గురూ మొబైల్‌‌ యాప్స్‌‌ ద్వారా ఆర్డర్లు, కస్టమర్ల వివరాలు కలెక్ట్‌‌ చేసేవారు. డార్క్‌‌ వెబ్‌‌సైట్స్‌‌లో డ్రగ్స్‌‌ కొనుగోలు చేసి, గోవా, ముంబైల నుంచి కొరియర్ల ద్వారా తెప్పించేవారు. పేమెంట్లను కూడా యాప్‌‌లోనే చేసేవారు. ఈ క్రమంలోనే కస్టమర్లకు ఎమ్‌‌డీఎమ్‌‌ఏ పిల్స్ సప్లయ్‌‌ చేసేందుకు అంకిత్‌‌, అజయ్‌‌ సాయి గురువారం మెహిదీపట్నం వచ్చారు. బస్టాప్‌‌లో కస్టమర్ల కోసం వెయిట్‌‌ చేస్తుండగా, సమాచారం అందుకున్న ఆసిఫ్‌‌నగర్ పోలీసులు వచ్చి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 50 ఎమ్‌‌డీఎమ్‌‌ఏ పిల్స్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో సాయిచరణ్‌‌ను అరెస్ట్‌‌ చేశారు. అతని వద్ద 60 ఎమ్‌‌డీఎమ్‌‌ఏ పిల్స్​ను కలెక్ట్‌‌ చేసుకున్నారు.

పిల్లలపై మానిటరింగ్‌‌ ఉండాలి

పిల్లలపై తల్లిదండ్రుల మానిటరింగ్‌‌ ఉండాలని , సీపీ అంజనీకుమార్‌‌‌‌ సూచించారు. తమ పిల్లలు డ్రగ్స్‌‌ వాడుతున్నట్లు చాలా మంది పేరేంట్స్‌‌ మాకు చెప్పారన్నారు. దీంతో డ్రగ్స్‌‌ సప్లయర్లపై ఫోకస్‌‌ పెట్టామని తెలిపారు.