- మరో రెండు చోట్ల ఇద్దరు స్పాట్ డెడ్
మియాపూర్/ జూబ్లీహిల్స్/ కూకట్పల్లి, వెలుగు: వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు ముగ్గురు మృతి చెందారు. జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లోదుర్గాప్రసాద్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం తన ఇద్దరు పిల్లలను స్కూల్ నుంచి బైక్‌పై తీసుకువస్తుండగా, నిలిపి ఉన్న కారును చూసి ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీంతో వాహనం స్కిడ్ అయ్యి ముగ్గురూ కిందపడగా, వెనుక కూర్చున్న కీర్తిక (14) పక్కనే వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లముందే కూతురు చనిపోవడంతో తండ్రి ఆవేదన స్థానికులను కలచివేసింది.
కారు ఢీకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ పసుపులేటి పెంచాల దేశిత్ (25) మృతి చెందారు. దేశిత్ తన స్నేహితుడు మునీశ్తో కలిసి బైక్వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేశిత్ తలకు తీవ్ర గాయాలై స్పాట్లోనే చనిపోయాడు.
గోడను ఢీకొట్టి మరొకరు..
బాలానగర్ పరిధిలో జరిగిన మరో ఘటనలో గౌతమ్ నగర్‌కు చెందిన అమితావ్ నాయక్ (35) అనే ప్రైవేట్ ఉద్యోగి మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బైక్‌పై కూకట్‌పల్లికి వెళ్తుండగా, ర్యాడ్‌క్లిఫ్ ఫ్యాక్టరీ సమీపంలో వాహనం అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న దర్గా గోడను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అమితావ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
