ఏసీబీ వలలో ఒకేరోజు ముగ్గురు

ఏసీబీ వలలో ఒకేరోజు ముగ్గురు

బెయిలివ్వడానికి డబ్బడిగిన జూబ్లీహిల్స్‌‌ ఎస్సై
ట్యాక్స్‌‌ తగ్గించేందుకు ఇవ్వాలన్న శేరిలింగంపల్లి ట్యాక్స్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌
సీజ్‌‌ చేసిన పేపర్ల కోసం లంచం డిమాండ్‌‌ చేసిన జీఎస్టీ అధికారి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కారు. 50 వేలు, మందు బాటిళ్లు లంచమడిగిన జూబ్లీహిల్స్‌‌ ఎస్సై సుధీర్‌‌రెడ్డి, రూ. 60 వేలు డిమాండ్‌‌ చేసిన జీఎస్టీ అధికారి భిక్షమయ్య, రూ. 15 వేలు కావాలన్న శేరిలింగంపల్లి సర్కిల్‌‌ టాక్స్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ యాదయ్యను ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు.

రూ. లక్ష అడిగిన ఎస్సై

తన సెలూన్‌‌కు వచ్చిన కస్టమర్‌‌ వంశీకృష్ణపై జూబ్లీహిల్స్‌‌లోని పేజ్‌‌ త్రీ సెలూన్‌‌ నిర్వాహకురాలు అక్షయ గతేడాది డిసెంబర్‌‌ 29న చీటింగ్‌‌ కేసు పెట్టింది. తనకు, తన భార్యకు ట్రీట్‌‌మెంట్‌‌ చేయించుకొని రూ. 31 వేల బిల్లు కట్టలేదని ఫిర్యాదులో పేర్కొంది. కేసులో నిందితుడు వంశీకి బెయిల్‌‌ ఇవ్వడంతో పాటు, లోక్‌‌ అదాలత్‌‌లో అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్సై సుధీర్‌‌రెడ్డి రూ. లక్ష డిమాండ్‌‌ చేశాడు. 50 వేలు, రెండు వ్యాట్ 69 మందు బాటిళ్లను ఇస్తానని వంశీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బు తీసుకోవడానికి జూబ్లీహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్‌‌ 10సీ దగ్గరకు రమ్మని చెప్పి ఏసీబీకి సమాచారమిచ్చాడు. ఎస్సై డబ్బు తీసుకుంటుండగా వాళ్లు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. కాగా, సీఐ బలవంతయ్య ఆదేశాల మేరకే డబ్బు తీసుకున్నానని ఎస్సై చెప్పాడు. ఎస్సై, సీఐ మధ్య జరిగిన మాటల కాల్‌‌ రికార్డ్స్‌‌ ఆధారంగా అధికారులు కేసు నమోదు చేశారు. సీఐ పరారీలో ఉన్నాడు.

ట్యాక్స్‌‌ పెంచి బెదిరించిన ట్యాక్స్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని బాపునగర్‌‌లో ఎజాజ్ ఖాన్‌‌కు 60 గజాల స్థలముంది. అందులోనే గతంలో రేకులేసుకొని నివాసం ఉన్నాడు. అప్పట్లో రూ. 336 ట్యాక్స్​చెల్లించాడు. ఇటీవల రెండంతస్థుల బిల్డింగ్ కట్టాడు. దీంతో టాక్స్ ఇన్‌‌స్పెక్టర్‌‌ యాదయ్య తన అసిస్టెంట్ సాయి ద్వారా ఖాన్ ఇంటిని కొలిపించి మూడేండ్లకు రూ.53, 000 ట్యాక్స్ కట్టాలన్నాడు. తమకు రూ. 14 వేలిస్తే ఏడాదికి రూ.5 వేలు ట్యాక్స్ వచ్చేలా చేస్తానన్నాడు. దీంతో డబ్బులిచ్చేందుకు ఒప్పుకున్న ఖాన్.. 3 రోజుల క్రితం ఏసీబీకి కంప్లైంట్ చేశాడు. గురువారం ఖాన్‌‌కు సాయి మళ్లీ ఫోన్‌‌ చేసి మొత్తం రూ. 15 వేలు తీసుకు రమ్మన్నాడు. సర్కిల్ కార్యాలయంలో సాయికి డబ్బిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. యాదయ్య, సాయిపై కేసు నమోదు చేశారు.

ఆఫీస్‌‌లోనే దొరికిన జీఎస్టీ అధికారి

ముంబై నుంచి హైదరాబాద్‌‌లోని శ్రీకృష్ణ ట్రేడర్స్‌‌కు బాదం లోడ్‌‌తో వస్తున్న ఓం ట్రాన్స్ పోర్టు లారీని లోడ్‌‌ వాల్యూకు తగిన పత్రాల్లేవంటూ మెహదీపట్నం దగ్గర సేల్స్‌‌ ట్యాక్స్‌‌ అధికారులు సీజ్‌‌ చేశారు. లోడ్‌‌ పత్రాలు సరైనవని తేలడంతో లారీని వదిలేశారు. కానీ ఒరిజినల్‌‌ ఇన్‌‌వాయిస్‌‌ పేపర్లు ఇచ్చేందుకు జీఎస్టీ అధికారి కె.భిక్షమయ్య రూ. 60 వేలు డిమాండ్ చేశాడు. తాను అంత డబ్బివ్వలేనని ట్రాన్స్‌‌పోర్టు మేనేజర్‌‌ దినేశ్‌‌ చెప్పడంతో రూ. 35 వేలివ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో దినేశ్‌‌ ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం నాంపల్లి గగన్‌‌విహార్‌‌లోని కార్యాలయంలో డబ్బు తీసుకుంటుండగా భిక్షమయ్యను అధికారులు పట్టుకున్నారు.