సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు జడ్జిల ప్రమాణం.. ఇంకా ఒక్క పోస్టే ఖాళీ  

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు జడ్జిల ప్రమాణం.. ఇంకా ఒక్క పోస్టే ఖాళీ  

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మంగళవారం ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు కొత్త బ్లాక్‌‌లోని ఆడిటోరియంలో వీరి చేత భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ, వివిధ హైకోర్టుల జ్యుడీషియల్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. 

తాజాగా ముగ్గురు జడ్జిల ప్రమాణంతో అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిల సంఖ్య 37కు చేరింది. సుప్రీంకోర్టుకు సీజేఐతో కలిపి మంజూరైన పోస్టులు మొత్తం 38 కాగా, ఇంకా ఒక్క పోస్టే ఖాళీగా ఉంది. ఈ ముగ్గురు కొత్త జడ్జిల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సెప్టెంబర్ 28న సిఫారసు చేసింది. ఈ పేర్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సోమవారం ప్రకటించారు. 

జస్టిస్ అగర్వాల్, జస్టిస్ ఉపాధ్యాయ ఇద్దరూ అలహాబాద్ హైకోర్టుకు చెందినవారు కాగా, జస్టిస్ సింగ్ జార్ఖండ్ హైకోర్టుకు చెందినవారు. జస్టిస్ అగర్వాల్ గుజరాత్ హైకోర్టు చీఫ్​ జస్టిస్​గా, జస్టిస్ ఉపాధ్యాయ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 

ఇక, జస్టిస్ సునీతా అగర్వాల్ నియామకంతో సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య మూడుకు చేరింది. వీరిలో జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ వెంకిట సుబ్రమణి మోహన ఉన్నారు. జస్టిస్ అగర్వాల్, జస్టిస్ నాగరత్న హైకోర్టులలో విధులు నిర్వహించగా..  జస్టిస్ మోహన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌‌గా నేరుగా బార్ నుంచి పదోన్నతి పొందారు. జస్టిస్ నాగరత్న తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.