ప్రాణాలు తీసిన పతంగుల ఆట

ప్రాణాలు తీసిన పతంగుల ఆట

 హైదరాబాద్‌‌, వెలుగు :  సంక్రాంతి పండుగ పూట పతంగులు ఎగురవేస్తూ కరెంట్ షాక్ తో ఇద్దరు, ఐదో ఫ్లోర్ నుంచి కింద పడి మరొకరు చనిపోయారు. వారి ఇండ్లల్లో పండుగ పూట విషాదం నెలకొంది. హైదరాబాద్ లోని బోరబండ రహ్మత్‌‌నగర్‌‌‌‌లో పతంగి ఎగురవేయడానికి వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. రహ్మత్‌‌నగర్‌‌‌‌కు చెందిన కపిల్ దేవ్ (23) సోమవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో తన ఫ్రెండ్ జగదీష్‌‌ ఇంటికి వెళ్లాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఐదవ అంతస్తుపైకి వెళ్లి పతంగులు ఎగురవేశారు. కొద్దిసేపటి తర్వాత కపిల్‌‌దేవ్‌‌ 3వ అంతస్తులో మెట్లు దిగుతూ.. లిఫ్ట్ కోసం తీసిన గుంతలో పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న కపిల్‌‌దేవ్‌‌ తమ్ముడు చౌహన్ శ్రీదేవ్‌‌ తన సోదరుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశాడు. కపిల్‌‌దేవ్ స్నేహితులైన ఆకాష్, జగదీష్, విజయ్, ప్రవీణ్, ఈశ్వర్, సంతోష్‌‌లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

కరెంట్ వైర్ల నుంచి గాలిపటం తీస్తూ.. 

విద్యుత్ వైర్లకు చిక్కుకుపోయిన గాలిపటాలను తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు బాలురు మృతిచెందారు. పండుగ పూట ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. యాప్రాల్ కు చెందిన భువన్ సాయి (13) ఆదివారం సాయంత్రం గాలిపటం ఎగరేస్తుండగా అది కరెంట్ వైర్లలో చిక్కుకుంది. పతంగిని స్టీల్ రాడ్డుతో తీసేందుకు ప్రయత్నించడంతో విద్యుత్ షాక్ తగిలి ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలుడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. కాటేదాన్ లోని గణేశ్​నగర్ కు చెందిన సంతోష్, స్రవంతి దంపతుల కొడుకు వివేక్ (13) మంగళవారం ఇంటిపైన పతంగి ఎగిరేస్తుండగా అది కరెంట్ వైర్లలో ఇరుక్కుంది. ఇనుప రాడ్ తో ఆ పతంగిని తీసేందుకు ప్రయత్నించడంతో కరెంట్ షాక్ కు గురై స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా, బాలుడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మైలార్ దేవ్ పల్లి పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడి మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.