
జింబాబ్వే, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రారంభమైన రెండో టెస్ట్ లో రెండున్నర రోజుల్లోనే ఫలితం వచ్చేసింది. కివీస్ బ్యాటింగ్, బౌలింగ్ ధాటికి పసికూన జింబాబ్వే దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బులవాయో వేదికగా ద క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో ముగిసిన ఈ మ్యాచ్ లో ఆతిధ్య జింబాబ్వేను న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 359 పరుగుల తేడాతో ఓడించి భారీ విజయాన్ని అందుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కివీస్ జట్టుకు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. ఈ రికార్డుతో 148 ఏళ్ళ టెస్ట్ క్రికెట్ లో తొలిసారి ఒక అరుదైన ఫీట్ నమోదయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో పరుగుల వరద పారించింది. తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 601 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్ చూసుకుంటే ముగ్గురు ప్లేయర్లు భారీ సెంచరీలు కొట్టడం విశేషం. నికోల్స్ (150), కాన్వే (153), రచీన్ రవీంద్ర (165) సెంచరీల మోత మోగించారు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఒకే ఇన్నింగ్స్ లో ముగ్గురు ఆటగాళ్లు 150 పరుగుల మార్క్ అందుకుని సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. 148 ఏళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో ముగ్గురు ఆటగాళ్లు 150 పరుగుల మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 125 రన్స్‌కే ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ (44) టాప్ స్కోరర్. టఫాడ్జ్వా సిగా (33 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. మ్యాట్ హెన్రీ (5/40), జకారీ ఫౌల్క్స్ (4/38) బంతితో చచెలరేగి జింబాబ్వేను స్వల్ప స్కోర్ కే పరిమితం చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 601 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. నికోల్స్ (150), కాన్వే (153), రచీన్ రవీంద్ర (165) సెంచరీల మోత మోగించారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో కివీస్ కు 476 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో జింబాబ్వే 117 పరుగులకే ఆలౌటైంది.