కమాండ్ కంట్రోల్ సెంటర్​లో చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

కమాండ్ కంట్రోల్ సెంటర్​లో చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

జూబ్లీహిల్స్, వెలుగు: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్​లో కాపర్ బండిల్స్ చోరీ చేసిన కేసులో ముగ్గురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ సుదర్శన్ కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్​ 12లో కమాండ్ కంట్రోల్​ సెంటర్ ను నిర్మిస్తోన్న షాపూర్ జీ పల్లోంజీ కన్ స్ట్రక్షన్ సంస్థ కాపర్ బండిల్స్ తెప్పించింది. ఒక్కో బండిల్ విలువ రూ. లక్షకు పైగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు మాట్లాడుకుంటుండగా.. అక్కడికి ఓసారి పనిమీద వచ్చిన టోలిచౌకీకి చెందిన అంబులెన్స్ డ్రైవర్ సోనూఖాన్ విన్నాడు. రోజు ఒక్కో కాపర్ బండిల్ కొట్టేసేందుకు సోనూఖాన్ స్కెచ్ వేశాడు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ స్టోర్ లో హెల్పర్ గా పనిచేసే రమేశ్, సెక్యూరిటీ గార్డు సౌరభ్ బిశ్వాస్, బికాశ్ రంజన్ బెహరా సాయాన్ని కోరాడు. వీరంతా ఒప్పుకోవడంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 21వ తేదీల మధ్య కాపర్ వైర్ బండిళ్లను బయటికి తరలించారు. ఇలా మొత్తం 38 బండిల్స్ దొంగిలించారు. వీటిని ఎన్ బీటీ నగర్ కు చెందిన స్క్రాప్ వ్యాపారులు జంగం సురేశ్, ఆవుల రాజు మల్లేశ్, ముషీరాబాద్ కు చెందిన అహ్మద్ హస్సేన్ కు అమ్మారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేశారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి సంబంధించి ఇటీవల కంపెనీ నిర్వాహకులు చేసిన ఆడిటింగ్​లో కాపర్ బండిల్స్ కనిపించకుండాపోయినట్లు గుర్తించారు. ఈ నెల 11న బంజారాహిల్స్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాత సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. సోనూ ఖాన్, రమేశ్, బికాశ్, సౌరభ్ చోరీ చేసినట్లు గుర్తించారు. రమేశ్​ పరారీలో ఉండగా.. మిగతా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్క్రాప్ వ్యాపారుల నుంచి కాపర్ బండిల్స్ ను స్వాధీనం చేసుకుని వారిపై కేసు ఫైల్ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.