- మూడు దశల్లో ఎన్నికలు
- దశల వారీ ఎన్నికలకు పంచాయతీలు.. వార్డుల విభజన
- అమల్లోకి ఎన్నికల కోడ్
యాదాద్రి, నల్గొండ, వెలుగు: పంచాయతీల ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఆఫీసర్లు రెడీ చేస్తున్నారు. మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు రెండేండ్లుగా ఎలాంటి ఎన్నికలు జరగకపోవడంతో సైలైంట్‌గా ఉన్న రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో అప్పుడే కార్యాచరణ ప్రారంభించాయి.
ఎన్నికల ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్ నంద్‌లాల్ పవార్ ఆధ్వర్యంలో ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ ఎన్నికలకు సంబంధించి గతంలోనే బ్యాలెట్ పేపర్లు ప్రింట్ అయ్యాయి. మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండలాలను విభజించారు.
పోలింగ్ స్టేషన్లను గుర్తించడంతో పాటు క్రిటికల్ స్టేషన్లను గుర్తించారు. పోలింగ్ ఆఫీసర్లను నియమించారు. అవసరమైన బ్యాలెట్ బాక్సులను సమకూర్చుకున్నారు. మూడు విడతలకు సంబంధించి నవంబర్ 27, 30, డిసెంబర్ 3తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. డిసెంబర్ 11,14,17 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు పోలింగ్ రోజే ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో 1782 పంచాయతీలు
యాదాద్రి జిల్లాలో 427 పంచాయతీలు ఉండగా 3704 వార్డులున్నాయి. సూర్యాపేటలో 486 పంచాయతీలు, 4388 వార్డులున్నాయి. నల్గొండ జిల్లాలో 869 పంచాయతీలు ఉండగా 7494 వార్డులున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 1782 పంచాయతీలు ఉన్నాయి. 15,586 వార్డులున్నాయి.
మొదటి విడతలో ఎన్నికలు జరిగే మండలాలు..
ఫస్ట్ ఫేజ్లో నల్గొండ జిల్లాలో చిట్యాల, కనగల్, కట్టంగూరు, కేతేపల్లి, నకిరేకల్, నల్గొండ, నార్కెట్ పల్లి, శాలిగౌరారం, తిప్పర్తి, చండూరు, గట్టుప్పల్, మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి మండలాల పరిధిలోని 317 గ్రామ పంచాయితీలలో ఎన్నికలు జరగనున్నాయి.
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, నాగారం, నూతన్ కల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్) మండలల పరిధిలోని 159 గ్రామ పంచాయితీలలో ఎన్నికలు జరగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం), బొమ్మల రామారం, తుర్కపల్లి మండలాల పరిధిలోని 153 గ్రామ పంచాయితీలలో ఎన్నికలు జరగనున్నాయి.
సెకండ్ ఫేజ్ లో
నల్గొండ జిల్లాలో అడవి దేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడుగుల పల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, వేములపల్లి మండలాల పరిధిలోని 282 గ్రామ పంచాయితీలలో, సూర్యాపేట జిల్లాలో చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం,మోతే, చివ్వెంల, పెన్ పహాడ్ మండలాల పరిధిలోని 181 గ్రామ పంచాయితీలలో, యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, బీబీ నగర్, భూదాన్ పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల పరిధిలోని 150 గ్రామ పంచాయితిలలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
మూడవ ఫేజ్ లో
నల్గొండ జిల్లాలోని చందం పేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండ మల్లేపల్లి, నేరేడుగొమ్మ, పెద్ద అదిశర్లపల్లి మండలంలోని 269 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనుండగా సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెర్వు, చింతలపాలెం, గరీడేపల్లి, నేరేడు చర్ల, పాలకీడు, హుజూర్ నగర్, మట్టంపల్లి మండలాల పరిధిలోని 146 గ్రామ పంచాయితీలలో ఎన్నికలు జరగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, నారాయణపూర్, అడ్డగుడూర్, మోత్కూర్, గుండాల, మోట కొండూర్ మండలాల పరిధిలోని 124 గ్రామ పంచాయితీలలో ఎన్నికలు జరగనున్నాయి.
మొదటి దశ డిసెంబర్ 11
జిల్లా మండలాలు జీపీ వార్డులు
యాదాద్రి 6 153 1286
సూర్యాపేట 8 159 1442
నల్గొండ 14 318 2870
రెండో దశ డిసెంబర్ 14
జిల్లా మండలాలు జీపీ వార్డులు
యాదాద్రి 5 150 1332
సూర్యాపేట 8 181 1628
నల్గొండ 10 282 2418
మూడవ దశ డిసెంబర్ 17
జిల్లా మండలాలు జీపీ వార్డులు
యాదాద్రి 6 124 1086
సూర్యాపేట 7 146 1318
నల్గొండ 9 269 2206
