మిషిగాన్ స్కూల్​లో కాల్పులు.. ముగ్గురు మృతి

మిషిగాన్ స్కూల్​లో కాల్పులు.. ముగ్గురు మృతి

మిచిగాన్: అమెరికాలోని మిషిగాన్ హైస్కూల్​లో ఓ పదిహేనేండ్ల స్టూడెంట్ తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు స్టూడెంట్లు అక్కడికక్కడే చనిపోగా.. మరో 8 మందికి బులెట్ గాయాలయ్యాయి. డెట్రాయిట్​ ఏరియాలోని ఆక్స్​ఫర్డ్ టౌన్​షిప్ ​స్కూల్​లో బుధవారం ఈ ఘటన జరిగిందని ఓక్లాండ్ కౌంటీ షరీఫ్ మైఖేల్ బోచార్డ్ మీడియాకు వెల్లడించారు. కాల్పులు జరిపిన స్టూడెంట్ ఆరోజు స్కూల్​కు రాలేదని, తన తండ్రి కొద్దిరోజుల కిందే కొన్న సెమీ ఆటోమేటెడ్ పిస్టల్​తో మధ్యాహ్నం స్కూల్లోకి వెళ్లాడని అధికారులు తెలిపారు. ‘‘ఆ సమయంలో స్కూల్​లో మొత్తం 1700 మంది పిల్లలున్నారు. నిందితుడు గన్​తో 20 రౌండ్లదాకా ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరిపి ముగ్గురిని చంపేశాడు. ఫైరింగ్ మొదలైన 5 నిమిషాల్లోనే పోలీసులు స్కూల్​ను చుట్టుముట్టి, నిందితుడిని అరెస్ట్ చేశారు”అని అధికారులు తెలిపారు.

పిస్టల్​తో పాటు ఏడు రౌండ్ల బులెట్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని జువైనల్ డిటెన్షన్ సెంటర్లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అతడు మైనర్ కావడంతో వివరాలు వెల్లడించలేదు. పోలీసులు కనిపించగానే నిందితుడు లొంగిపోయాడని, లాయర్​ను నియమించాలని కోరాడని చెప్పారు. 16, 14, 17 ఏండ్ల అమ్మాయిలు కాల్పుల్లో చనిపోయారని చెప్పారు. మరో ఇద్దరి పరిస్థితి సీరియస్​గా ఉందని, మిగతా ఆరుగురు స్టేబుల్​గా ఉన్నారని తెలిపారు. దాడి తర్వాత స్కూల్​లోని స్టూడెంట్లందరినీ పోలీసులు  ఇంటికి పంపించారు. వారంపాటు సెలవులు ప్రకటించినట్లు స్కూల్ మేనేజ్మెంట్ తెలిపింది. కాగా, స్కూల్​లో కొందరు స్టూడెంట్లతో గొడవలవుతున్నాయని తమ కొడుకు చెప్పాడని, అందుకే స్కూల్​కు కూడా ఎగ్గొట్టినట్టున్నాడని దాడికి పాల్పడిన బాలుడి తల్లిదండ్రులు చెప్తున్నారు.