స్ట్రాంగ్ రూమ్స్ వద్ద టైట్ సెక్యూరిటీ.. సీసీ కెమెరాలతో నిఘా 24/7 నిఘా

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద టైట్ సెక్యూరిటీ.. సీసీ కెమెరాలతో నిఘా 24/7 నిఘా

హైదరాబాద్/చేవెళ్ల, వెలుగు: పోలింగ్ ​ముగియగానే ఆయా కేంద్రాల్లోని ఈవీఎంలు, వీవీ ప్యాట్లను అధికారులు సోమవారం అర్ధరాత్రి లోపు స్ట్రాంగ్​రూమ్స్​కు తరలించారు. హైదరాబాద్​జిల్లా పరిధిలోని స్ట్రాంగ్ రూమ్స్​వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సెగ్మెంట్ జనరల్ అబ్జర్వర్ పీఐ శ్రీవిద్య,​ రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్​అనుదీప్​ దురిశెట్టి తెలిపారు. చేవెళ్ల రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ శశాంక, వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్  ప్రతిమాసింగ్, వికారాబాద్ అడిషనల్​కలెక్టర్ రాహుల్ శర్మ, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

ఎలాంటి గందరగోళం, లోటుపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టారు. స్ట్రాంగ్​రూమ్స్​వద్ద సీఆర్​పీఎఫ్​, రాష్ట్ర సాయుధ దళాలు, సివిల్ పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పహారా కాయనున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఎవరైన అనుమానాస్పదంగా తిరిగినా, అనుమతి లేకుండా స్ట్రాంగ్ రూమ్ డోర్ వద్దకు వెళ్లినా రిటర్నింగ్​ఆఫీసర్​చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. స్ట్రాంగ్​రూమ్స్ నుంచి 200 మీటర్లు దూరం వరకు144 సెక్షన్​ అమలులో ఉంది. హై డెఫినెషన్ సీసీ కెమెరాలను అమర్చి స్థానికంగా ఉన్న కంట్రోల్ రూమ్ కు కనెక్ట్ చేశారు.

ఎక్కడెక్కడంటే..

మలక్​పేట పరిధిలోని ఈవీఎంలు, వీవీ ప్యాట్లను అంబర్ పేట ఇండోర్ స్టేడియంలో, కార్వాన్​ లోని ఈవీఎంలను మాసబ్​ట్యాంక్​ పాలిటెక్నిక్ కాలేజీలో, గోషామల్​లోని వాటిని కోఠి ఉమెన్స్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్స్​లో భద్రపరిచారు. చార్మినార్​కు సంబంధించినవి నాంపల్లి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీ, చాంద్రాయణగుట్టలోని వాటిని బషీర్​బాగ్ ​నిజాం కాలేజీ లైబ్రరీ హాల్ లో, యాకుత్​పురాకు సంబంధించినవి నాంపల్లి సరోజిని నాయుడు వనితా మహావిద్యాలయలో, బహదూర్​పురాకు చెందినవి బండ్లగూడ అరోరా లీగల్ సైన్స్ అకాడమీలో ఉంచారు.

నాంపల్లి లోని ఈవీఎంలు, వీవీప్యాట్లను మాసబ్​ట్యాంక్​ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో, ముషీరాబాద్​కు చెందినవి దోమలగూడలోని ఏవీ కాలేజీలో అంబర్​పేటకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను నారాయణగూడ రాజాబహదూర్​ వెంకటరామి రెడ్డి ఉమెన్స్​ కాలేజీలో సనతనగర్ లోని ఈవీఎంలు, వీవీప్యాట్లను ఓయూ కామర్స్​కాలేజీలో, సికింద్రాబాద్​కు చెందినవి ఓయూలోని సెంటర ఫర్​ డిస్టెన్స్​ఎడ్యుకేషన్ లో, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్​పరిధిలోని ఈవీఎంలను యూసఫ్​గూడ కోట్ల విజయభాస్కర్​ రెడ్డి ఇండోర్​ స్టేడియం  సౌత్, నార్త్ వింగ్ లో భద్రపరిచారు.

కంటోన్మెంట్​స్థానానికి సంబంధించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను సికింద్రాబాద్​సీఎస్​ఐఐటీ వెస్లీ కాలేజీలో ఉంచారు. మేడ్చల్​, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి స్థానాలకు చెందిన వాటిని బోగారం హోలీ మేరీ కాలేజీలో ఉంచారు. ఎల్బీనగర్​లోని ఈవీఎంలను స్థానిక ఇండోర్​స్టేడియంలో, చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్​అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఉంచారు.