జీతాలు ఆపి రైతు బంధు ఇచ్చినం : మంత్రి హరీష్ రావు

జీతాలు ఆపి రైతు బంధు ఇచ్చినం : మంత్రి హరీష్ రావు

రైతులకు రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తున్నామని, రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. రైతు బంధు ద్వారా రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశామని, రైతు చనిపోతే రైతు బీమా ద్వారా రూ.5లక్షలు ఇస్తున్నామన్నారు. 98 వేల మంది రైతుల కుటుంబాలకు రైతు బీమా ద్వారా రూ.5లక్షలు ఇచ్చామని తెలిపారు. ఎండాకాలంలో కూడా హల్దీ వాగు చెక్ డ్యామ్ ల పై నుండి మత్తడి దూకుతోందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో తూప్రాన్ లో మూడు మార్కెట్లు వచ్చాయని స్పష్టం చేశారు. గతంలో ఈ  ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న వారు ఒక్క మార్కెట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగుల, ఎమ్మెల్యేల, జీతాలు ఆపి రైతులకు రైతుబంధు వేశామని చెప్పారు.

వ్యవసాయ గ్రీన్ మార్కెట్ యార్డ్ ప్రారంభం

మెదక్ జిల్లాతూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో రూ.5 కోట్ల తో నిర్మించిన వ్యవసాయ గ్రీన్ మార్కెట్ యార్డ్ ను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ముప్పిరెడ్డి పల్లికి చెందిన 379 మంది భూనిర్వాసితులకు ఇళ్ల పట్టాలు అందజేసిన మంత్రి...కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. తూప్రాన్ పట్టణంలో రూ.22 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. తూప్రాన్ మండలంలోని ఆదర్శ మల్కాపుర్ లో రూ.2.20 కోట్ల  తో నిర్మించిన పలు భవనాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే రూ.20 కోట్ల తో మల్కాపుర్ యవపూర్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.