జూడో ట్రైనింగ్ పేరుతో పిల్లాడిని 27 సార్లు విసిరికొట్టిండ్రు

జూడో ట్రైనింగ్ పేరుతో పిల్లాడిని 27 సార్లు విసిరికొట్టిండ్రు
  • 27 సార్లు మ్యాట్‌‌పైకి ఎత్తిపడేసిన కోచ్, తోటి స్టూడెంట్స్ 
  • 70 రోజుల కోమా తర్వాత మృతిచెందిన తైవాన్ పిల్లాడు

తైపీ: తైవాన్​లో జూడో ట్రెయినింగ్ ఏడేండ్ల పిల్లాడి ప్రాణం తీసింది. ట్రైనింగ్​కు కొత్తగా వచ్చిన పిల్లాడు తిట్టాడని కోపం తెచ్చుకున్న కోచ్ అతనిని మళ్లీ మళ్లీ మ్యాట్ పైకి ఎత్తిపడేశాడు. తోటి స్టూడెంట్లతో కూడా విసిరికొట్టించాడు. అందరూ కలిసి 27 సార్లు ఎత్తి పడేయడంతో కోమాలోకి వెళ్లిన ఆ పిల్లాడు 70 రోజుల తర్వాత మంగళవారం రాత్రి కన్నుమూశాడు. లోకల్ మీడియా వివరాల ప్రకారం.. తైవాన్​లోని ఫెన్ గ్యుయాన్ సిటీలో హో అనే కోచ్ ఫ్రీగా జూడో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎలాంటి లైసెన్స్ లేకుండానే ట్రెయినింగ్ సెంటర్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో హువాంగ్ అనే ఏడేండ్ల పిల్లాడు ట్రెయినింగ్ కోసం చేరాడు. ఆ పిల్లాడు ఏప్రిల్ 21న చెప్పినట్లు చేయకపోవడం, ‘కోచ్ ఒక పెద్ద ఇడియట్’ అని కామెంట్ చేయడంతో విపరీతమైన కోపం తెచ్చుకున్న హో.. బేసిక్స్ తెలియని కొత్త పిల్లాడు అని కూడా చూడకుండా ‘త్రో టు ద మ్యాట్’ టెక్నిక్ ను ప్రయోగించాడు. పిల్లాడు వాంతులు చేసుకున్నా, నొప్పి వస్తోంది, ఆపాలని ఏడుస్తూ వేడుకున్నా అలాగే ఎత్తి పడేయించాడు. దీంతో స్పృహ తప్పిపోయిన హువాంగ్ కోమాలోకి పోయాడు. పిల్లాడి బాడీలో కొన్ని అవయవాలు పని చేయకపోవడంతో చివరకు పరిస్థితి విషమించి చనిపోయాడు. హువాంగ్ ను గాయపర్చి చంపడంతో పాటు ఇతర పిల్లలనూ నేరానికి రెచ్చగొట్టినందుకు కోచ్ పై కేసు నమోదైంది. అతను బెయిల్ పై విడుదల కాగా, దర్యాప్తు కొనసాగుతోంది. అయితే జూడో ట్రెయినింగ్ లో ఇలా విసిరేయడం సాధారణమే అంటూ హో  సమర్థించుకుంటున్నాడు.