భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి పాదాల చెంత నుంచే తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయన తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన మే 14 సందర్భంగా గురువారం భద్రాచలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరవాది విజయరాఘవన్ ఆధ్వర్యంలో వేదాశీర్వచనం అందించారు.
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఈవో దామోదర్ రావు జ్ఞాపిక, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భద్రాచలం నియోజకవర్గంలోని చర్లలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరానని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా అభివృద్ధి, గిరిజన ప్రాంతాల సంక్షేమం కోసం రాముడి ఆశీస్సులతోనే పనిచేశానని చెప్పారు.
భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ కోసం సాకేతపురి–సారపాక నుంచి పాండురంగాపురం వరకు 16 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నేపథ్యంలో భద్రాచలం నుంచి బకింగ్ హామ్ కెనాల్ ద్వారా చెన్నై వరకు జలరవాణాను పునరుద్ధరించేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో అధికారులు ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాకు నేషనల్ హైవే కనెక్టివిటీ కల్పించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గోదావరి పుష్కరాలకు మెరుగైన ఏర్పాట్లు..
సీతానిలయంలో ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఈవో దామోదర్ రావుతో కలిసి అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రాచలాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ఇందులో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.
జూన్, జూలై నెలల్లో గోదావరి కరకట్ట ప్రాంతాల్లో నర్సరీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, రోడ్లు, లైట్లు, విద్యుత్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి తిలకించి కేక్ కట్ చేశారు.
అశ్వారావుపేటలో హార్టికల్చర్ కాలేజీ ప్రారంభం
అశ్వారావుపేట: అగ్రికల్చర్ కాలేజీకి తోడు హార్టికల్చర్ కాలేజీ ఏర్పాటుతో అశ్వారావుపేట ప్రాంతానికి మరింత గుర్తింపు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన కళాశాలను ప్రారంభించారు. అనంతరం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద నిర్వహించిన రైతుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంటకు టన్నుకు రూ.25 వేల కంటే తక్కువ ధర రాకుండా చూడటం తన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ షేక్ యాస్మిన్ భాషా, వ్యవసాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సురేంద్రమోహన్, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి పాల్గొన్నారు.
