
ఓం నమ: శివాయ అన్నా.. హర హర మహాదేవ శంభోశంకర అంటే చాలు పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను ఇట్టే నెరవేరుస్తాడు. అలాంటి శివయ్యకు మారేడు దళం అంటే ఎంతో ఇష్టం. కాని అంతకంటే ఎక్కువ తుమ్మి పువ్వులు ఇష్టమని శివపురాణం ద్వారా తెలుస్తుంది. మహేశ్వరునికి తుమ్మి పువ్వులు అంటే ఎందుకంత ఇష్టం.. పురాణాల్లో ఏముంది.. ఆధ్యాత్మిక వేత్తలు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. కోరిన కోరికలను తీర్చే దేవుడు ఆ భోళా శంకరుడు. ఎవరైనా సరే శివలింగంపై కొన్ని నీళ్లు పోసి భక్తితో కన్నీళ్ళతో పరమేశ్వర ఆదుకోవయ్యా అని వేడుకోగానే వెంటనే ఆదుకునే దేవుడు ఆ పరమేశ్వరుడు. అలాంటి శివయ్యను తుమ్మి పువ్వులతో పూజిస్తే వెంటనే అనుగ్రహం ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు. కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయని.. కష్టాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
వెయ్యి జమ్మి పువ్వులు శివలింగం పై పెట్టి పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో... ఒక్క తుమ్మి పువ్వు పెడితే అంత ఫలితం వస్తుందని చెబుతున్నారు. పరమేశ్వరుడికి తుమ్మి పువ్వు అంటే చాలా ప్రతీకరము. మారేడు పువ్వుకంటే కూడా తుమ్మి పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టమని శివపురాణం చెబుతోంది.
సృష్టికి ఆది దంపతులు పార్వతి పరమేశ్వరుడు. అలాంటి పార్వతీ పరమేశ్వరులను మనం నిత్యం ఆరాధిస్తూ వుంటాము. వెయ్యి తెల్లజిల్లేడు పుష్పాలను తెచ్చి శివసహస్రనామం చదివి శివలింగంపైన వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఒక గన్నేరు పుష్పాన్ని శివలింగంపైన పెడితే అంత ఫలితం వస్తుంది అని శాస్త్రం మనకు చెబుతోంది. వెయ్యి గన్నేరు పుష్పాలను శివసహస్రనామం చదివి శివలింగంపైన పెడితే ఎంత పుణ్యమైతే వస్తుందో అంతే పుణ్యం ఒక్క మారేడు దళం శివలింగంపైన పెడితే అంత ఫలితం వస్తుంది. అలాగే ఒక బిల్వపత్రాన్ని శివలింగంపైన పెడితే మూడు జన్మల పాపాలను శివుడు హరించివేస్తాడట. వెయ్యి బిల్వదలాలను శివలింగం పైన వేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క తామరపువ్వును శివలింగపైన పెడితే అంత ఫలితం వస్తుంది. అదేవిదంగా వెయ్యి తామర పుష్పాలను శివలింగం పైన పెడితే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితం ఒక్క ఉమ్మెత్తు పువ్వును శివలింగం పైన పెడితే వస్తుందని శాస్త్రం మనకు చెబుతోంది.వెయ్యి జమ్మి పువ్వులు శివలింగంపై పెట్టి పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క తుమ్మి పువ్వు పెడితే అంత ఫలితం వస్తుందని చెబుతున్నారు. శివుడికి ఎన్ని పువ్వులతో పూజచేసినా తుమ్మి పువ్వులతో పూజ చేయడం మరిచిపోవద్దు. శివుడిని తుమ్మి పువ్వులతో పూజచేయడం చాలా శుభప్రదం.
శివుడికి తుమ్మి పువ్వు ఎందుకిష్టమనేదానిపై శివపురాణంలో ఒక కథ వుంది. పూర్వం ఒక ఆటవికుడు అడవిలో వెళ్తుంటాడు. అతనికి శివుడంటే భక్తి. మార్గ మధ్యలో చలిఎక్కువగా వుండడం వల్ల ఆగిపోతాడు. అక్కడ శివలింగం వుంటుంది. శివలింగానికి నమస్కారం చేసుకొని ఒక చోట తలదాచుకొని తన దగ్గర వున్న సంచిని కప్పుకొని నిద్రపోతాడు. మధ్యలో మెలుకవ వచ్చి చలివల్ల శివుడు కూడా వణుకుతాడనుకొని ఆ సంచిని శివలింగం పైన కప్పుతాడు. దాంతో శివుడు ప్రసన్నమై భక్తుడికి ఏమి కావాలో అడుగుతాడు. తన పాదాలు ఎప్పుడూ శివుడి పైన వుండాలని కోరుతాడు, అంటే శివుడి పాదాలు తనపైన వుండాలని సరిగ్గా అడకకుండా తప్పుగా అడుగుతాడు.
అయినా కూడా శివుడు అతని కోరికను ప్రసాదిస్తాడు. వచ్చే జన్మలో ఆ ఆటవికుడు తుమ్మి పువ్వుగా జన్మించి, పాదాల రూపంలో వుండి ఎప్పుడూ తనపై వుండేలా కోరికను ప్రసాదిస్తాడు.అందుకే తుమ్మి పువ్వు పాదాల ఆకారంలో వుంటుంది. ఈ రకంగా శివుడికి తుమ్మి పువ్వంటే ఎక్కువ ఇష్టమని శివపురాణం మనకు చెబుతుంది.