మున్సిపల్ ఎన్నికలు: ఆశావహులకు టికెట్ టెన్షన్.. ఇప్పటి వరకు అభ్యర్థులను కన్ఫామ్ చేయని పార్టీలు

మున్సిపల్ ఎన్నికలు: ఆశావహులకు టికెట్ టెన్షన్.. ఇప్పటి వరకు అభ్యర్థులను కన్ఫామ్ చేయని పార్టీలు
  •     ఇప్పటి వరకు అభ్యర్థులను కన్ఫామ్ చేయని పార్టీలు.. దీంతో జోరుగా నామినేషన్లు వేస్తున్న ఆశావహులు 
  •      అటు టికెట్ల కోసం జోరుగా జంపింగ్​లు 
  •      కాంగ్రెస్​లోకే ఎక్కువ వలసలు 
  •      ముఖ్య నేతల సమక్షంలో చేరికలు
  •      రెండో రోజు భారీగా నామినేషన్లు

హైదరాబాద్, వెలుగు: ప్రధాన పార్టీల నుంచి మున్సిపల్ ​ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులకు  టికెట్​ టెన్షన్​ పట్టుకుంది. నేటితో (శుక్రవారం)తో నామినేషన్ల స్వీకరణ  ముగియనుండగా, మెజారిటీ చోట్ల పార్టీలేవీ టికెట్లు ఖరారు చేయలేదు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ నుంచి ఒక్కో డివిజన్​లో పెద్దసంఖ్యలో ఆశావహులు ఉండడం, అభ్యర్థుల లిస్టులు ఆలస్యం కానుండడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్నది. ముందే అభ్యర్థులను ప్రకటిస్తే మిగిలినవాళ్లు ప్రత్యర్థి పార్టీల్లోకి వెళ్లే అవకాశం ఉండడంతో చివరి నిమిషం దాకా బీఫామ్స్​ఇచ్చే విషయంలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 

కాంగ్రెస్​అయితే ఫిబ్రవరి 2నే బీఫాంలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఎందుకైనా మంచిదని ఆశావాహులంతా జోరుగా నామినేషన్లు వేస్తున్నారు. అదే సమయంలో టికెట్లపై హామీలతో పలువురు తాజా మాజీ కౌన్సిలర్లు పార్టీ మారుతున్నారు.  ముఖ్యంగా బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరుతున్నారు. 

నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ..  

ఈ నెల 27న మున్సిపల్​ ఎన్నికల షెడ్యూల్​ రిలీజ్ చేసిన స్టేట్​ఎలక్షన్​ కమిషన్​ నామినేషన్ల దాఖలుకు 30దాకా గడువు ఇచ్చింది. సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు మల్లగుల్లాలు పడ్తున్నాయి. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఈసీ ఇచ్చిన మూడు రోజుల వ్యవధిలో అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి బీ ఫాం ఇవ్వడం  పెద్ద టాస్క్​గా మారింది. 

కాగా, శుక్రవారం వరకు మాత్రమే గడువు ఉండడంతో ఎందుకైనా మంచిదని కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ నుంచి ఆశావాహులు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు. మొదటి, రెండో రోజు పడిన నామినేషన్లను పరిశీలిస్తే ఒకే పార్టీలో ఒక్కో వార్డు నుంచి సగటున ఇద్దరి నుంచి ఐదుగురు వరకు నామినేషన్లు సమర్పించినట్లు స్పష్టమవుతోంది.  శుక్రవారం ఈ సంఖ్య రెట్టింపు అవుతుందనే అంచనా ఉంది. ఆశావహులు  సైతం రిజర్వేషన్లను బట్టి కుల, వర్గ సమీకరణాలను బట్టి ముందుకు పోతున్నారు.  ఓవైపు గ్రౌండ్ లెవల్​లో ప్రచారం చేసుకుంటూనే మరోవైపు  టికెట్ల కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాగా, సర్వే ప్రకారమే టికెట్లు ఉంటాయని నేతలు చెప్తుండడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.  

భారీగా వలసలు.. 

స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువ  ఉంటున్నాయి. బీఆర్ఎస్​ హయాంలో ఇదే జరిగింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో 65శాతానికి పైగా గ్రామాల్లో కాంగ్రెస్​పాగా వేసింది. దీంతో చాలామంది ఆశావహులు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్​లో  చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. టికెట్​పై హామీలు తీసుకొని గోడ దూకుతున్నారు.  పలుచోట్ల అధికారాపార్టీలో టికెట్లు రావనే సంకేతాలతో పలువురు గులాబీ గూటికీ చేరుతున్నారు. 

-ఖమ్మం కార్పొరేషన్​కు చెందిన 8 మంది బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు ఇప్పటికే సీఎం రేవంత్​ సమక్షంలో కాంగ్రెస్​లోచేరగా, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల నుంచి ఆ పార్టీ కి చెందిన మాజీ కౌన్సిలర్లు వెల్దండి దేవదాస్​, దూస విజయ్​, గౌడ రాజుతో పాటు పలువురు విప్​ ఆది శ్రీనివాస్​ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్​ పార్టీలో చేరారు. అంతకుముందు చెన్నూర్​లో మంత్రి వివేక్​ వెంకటస్వామి ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​, బీజేపీ నుంచి వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్​ కండువాలు కప్పుకున్నారు. 

హుస్నాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ  తాజా మాజీ వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం18 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ తాజా మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్​ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిర్మల్ మున్సిపల్ పరిధిలో మూడు సార్లు కౌన్సిలర్ గా గెలిచిన అయ్యన్నగారి రాజేందర్ బీజేపీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. 

నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ లో  సన్ షైన్ విద్యాసంస్థల చైర్మన్, మాజీ కౌన్సిలర్  కోడి వెంకన్న, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోడి సుష్మా వెంకన్న బీఆర్ఎస్​ నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం  కార్పొరేషన్​లో  ఇద్దరు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్  నుంచి బీఆర్ఎస్​లో చేరారు. ఆదిలాబాద్​లో మాజీ చైర్ పర్సన్ రంగినేని మనీషా బీఆర్ఎస్ నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లో చేరారు.