హోటల్ గ్యాస్ బండ వెయ్యి రూపాయలు పెంపు.. హైదరాబాద్లో బండ రూ. 3 వేలు.. ఎనీ టిఫిన్ 50 రూపాయలు చేసేశారుగా..

హోటల్ గ్యాస్ బండ వెయ్యి రూపాయలు పెంపు.. హైదరాబాద్లో బండ రూ. 3 వేలు.. ఎనీ టిఫిన్ 50 రూపాయలు చేసేశారుగా..

డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరగలేదని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రమే పెరిగిందని సంబరపడకండి. కమర్షియల్ సిలిండర్ల ధర పెరగడం వల్ల పరోక్షంగా మన మీద కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉంది. హైదరాబాద్లో బయటకు వెళ్లి హోటల్లో ఒక ప్లేట్ టిఫిన్ తింటే నిన్నమొన్నటి దాకా 30 నుంచి 40 రూపాయల్లో అయిపోయేది. హైదరాబాద్లో రోడ్ల పక్కన XL బండ్లపై టిఫిన్ అమ్మే బాబాయిలు కూడా ప్లేట్ 20 రూపాయల నుంచి 25 రూపాయలకు పెంచేశారు. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు పెరగడంతో పెద్ద పెద్ద హోటల్స్ దగ్గర నుంచి ఇలా రోడ్ల పక్కన అమ్మే టిఫిన్ బండ్ల దాకా మరోసారి ధరలు పెంచేశారు.

మే 1న ఉదయం కమర్షియల్ సిలిండర్ ధర 993 రూపాయలు పెరిగిందనే విషయం తెలిసిన గంటల వ్యవధిలోనే.. నిన్నటి దాకా 40 రూపాయలు అమ్మిన ప్లేట్ టిఫిన్ ధర 50 రూపాయలకు పెంచేశారు. ఇదేంటని కస్టమర్లు అడిగితే.. ఒకేసారి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను వెయ్యి రూపాయలు పెంచేశారని, తాము రేట్లు పెంచక తప్పలేదని.. రేట్లు పెంచకపోతే హోటల్స్ మూసేసుకోవాల్సి పరిస్థితి ఉందని హోటల్స్ నిర్వాహకులు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. 

కమర్షియల్ సిలిండర్పై ధరను ఒకేసారి దాదాపు వెయ్యి రూపాయల దాకా పెంచడంతో హోటల్స్పై తీవ్ర ప్రభావం పడింది. ప్లేట్ టిఫిన్ ఏదైనా 10 రూపాయలు పెంచేశారు. ఇక ప్లేట్ మీల్స్పై ఎంత పెంచుతారోననే భయం కస్టమర్లలో ఉంది. ఒక్క హైదరాబాద్లోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు విక్రయాలు జరుగుతాయి. టీ స్టాల్‌‌‌‌‌‌‌‌లు నుంచి స్టార్​ హోటళ్ల వరకు నెలకు 4 నుంచి 5.50 లక్షల సిలిండర్లకు అవసరం ఉంటుంది. ఇండస్ట్రీలకు మరో 1.50 లక్షలు అదనంగా డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంది. ఈ మొత్తం కమర్షియల్ సేల్స్ విలువ నెలకు రూ.140 నుంచి  రూ.150 కోట్లకు చేరుతుందని గ్యాస్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి.