రైలు ఢీకొనడంతో మరణించిన పెద్ద పులి

రైలు ఢీకొనడంతో మరణించిన పెద్ద పులి

రైలు ఢీకొనడంతో పెద్ద పులి మరణించింది. నల్లమల అడవిలోని గుండ్ల బ్రహ్మఈశ్వరం అభయారణ్యం ప్రాంతంలోని దిగువమెట్ట – చలమ రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి  రైల్వే పట్టాలు దాటుతున్న పెద్ద పులిని రైలు ఢీకొంది. దీంతో పులి అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషయాన్ని రైలు డ్రైవర్ పోలీసులకు తెలిపారు.  విషయం తెలుసుకున్న అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ గోపీనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేటగాళ్ల జాడ లేవి సమీప పరిసరాల్లో కనపడలేదని చెప్పారు.

228/2 రైల్వే ట్రాక్ మలుపు దగ్గర పెద్ద పులిని రైలు ఢీకొన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అయితే ట్రైన్ డ్రైవర్ చెలమ రైల్వే స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో విషయం అటవీ అధికారులకు తెలిసింది. జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం అధికారి డాక్టర్ జి. రవిబాబు, గాజులపల్లె పశు వైద్యాధికారి డాక్టర్ కరుణాకర్ లు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టు మార్టం నిర్వహించారు.

చనిపోయిన పులి శరీరంలో ముళ్ల పంది.. ముళ్లు గుచ్చుకుని ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఆ ముళ్లు పులి ఊపిరితిత్తుల్లో, గుండెలో కుచ్చుకుపోయాయని చెప్పారు. గాయాలను పరిశీలించగా.. పులి రెండు మూడు రోజుల క్రితం ముళ్ల పందిని వేటాడిందని చెప్పారు. అప్పుడే ముళ్లు పులి శరీరంలో దిగబడ్డాయని అన్నారు. దీంతో అనారోగ్యం పాలైన పులి రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రైలు ఢీకొట్టి ఉంటుందని తెలిపారు. శరీరంలోని కీలక భాగాలను ప్రత్యేక పద్ధతి లో సేకరించి నిర్ధారణ కోసం.. హైదరాబాద్ సీసీఎంబీ కి పంపిస్తున్నామని చెప్పారు.