అక్టోబర్ 20 నుంచి పులుల లెక్కింపు! ప్రతి జిల్లా నుంచి ఇద్దరు అధికారులకు ట్రైనింగ్

అక్టోబర్ 20 నుంచి పులుల లెక్కింపు!  ప్రతి జిల్లా నుంచి ఇద్దరు అధికారులకు  ట్రైనింగ్
  • పీసీసీఎఫ్‌‌‌‌ (వైల్డ్‌‌‌‌లైఫ్‌‌‌‌) ఏలూసింగ్‌‌‌‌ మేరు వెల్లడి

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో పులుల లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్​నుంచి పులుల గణన ప్రారంభించనున్నారు. నిజానికి 2026లో గణన మొదలు పెట్టాల్సి ఉండగా.. చలికాలంలో అనుకూల పరిస్థితుల కారణంగా.. పెద్దపులులు, ఇతర జంతువుల సంచారం గణనీయంగా పెరగనున్నాయి. 

ఈ  నేపథ్యంలో  వచ్చే నెల 20 నుంచి  పులుల గణన  ప్రారంభించనున్నట్లు  పీసీసీఎఫ్‌‌‌‌ (వైల్డ్‌‌‌‌లైఫ్‌‌‌‌) ఏలూసింగ్‌‌‌‌ మేరు పేర్కొన్నారు. ఈ గణనను వీలైనంత మేరకు రాష్ట్రంలో ఎండాకాలం మొదలయ్యేలోగా పూర్తిచేసేలా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.  ఒకవేళ వేసవిలోగా ఈ ​‍ప్రక్రియ పూర్తికాకపోతే.. ఆ తర్వాత దీనిని పునః ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.  

అక్టోబర్ 23 నుంచి శిక్షణ తరగతులు.. 

పులుల గణనకు సంబంధించి రాష్ట్రస్థాయిలో దూలపల్లిలోని ఫారెస్ట్​ అకాడమీలో గురువారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.  ప్రాంతీయంగా, అన్ని జిల్లాస్థాయిల్లో  ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి సిబ్బందికి శిక్షణ ఇస్తారు.  ముందుగా టీవోటీలకు శిక్షణ ఇచ్చిన తర్వాత వారు తిరిగి కిందిస్థాయిలో శిక్షణనిచ్చేలా చర్యలు తీసుకుంటారు.  

ముందుగా రక్షిత అటవీ ప్రాంతాల్లో పులుల గణన చేపడతారు.  ఈ ​ప్రక్రియలో అన్నిస్థాయిల అధికారులను భాగస్వాములు చేస్తారు.  మొత్తం 28 జిల్లాల నుంచి..  అంటే ఒక్కొక్క జిల్లా నుంచి ఒక అధికారి, మరో జూనియర్‌‌‌‌ అధికారికి శిక్షణనివ్వనున్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని పీసీసీఎఫ్​ సువర్ణ, పీసీసీఎఫ్​ (వైల్డ్​ లైఫ్​) ఏలూసింగ్​ మేరు ప్రారంభించనున్నారు.

2022 నాటికి దేశంలో 3,682 పులులు 

పులుల గణనకు సంబంధించి పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. పాదముద్రలు, పెంటికల్​ (విసర్జితాలు) సేకరించాలి..? గణనకు సంబంధించిన పలు  అంశాలపై వివరించనున్నారు.  ఇక్కడ శిక్షణ పొందినవారు జిల్లాలో అటవీ సిబ్బందికి పులుల గణనపై  శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  

పులుల గణన అనేది పులుల సంఖ్య, పంపిణీ, ఆరోగ్యం వంటి కీలక సమాచారాన్ని సేకరించడానికి ప్రతి నాలుగేండ్లకు ఒకసారి నిర్వహిస్తారు. 2022 నాటి గణాంకాల ప్రకారం..  దేశంలో 3,682 పులులు ఉన్నాయి (కనీసం 3,167), ఇది 2006లో ఉన్న 1,411 పులుల కంటే దాదాపు రెట్టింపు. ఈ గణన పులులకు ఎదురయ్యే ముప్పులను పరిష్కరించడానికి ప్రణాళికలు రూపొందించడానికి దోహదం చేస్తుంది.  దీనిని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ)  పర్యవేక్షించనున్నది.