పెద్దపల్లి జిల్లాలో 4 రోజులుగా పులి సంచారం..పట్టించుకునేటోళ్లేరీ.?

పెద్దపల్లి జిల్లాలో 4 రోజులుగా పులి సంచారం..పట్టించుకునేటోళ్లేరీ.?

పెద్దపల్లి, వెలుగుదారి తప్పిన పెద్దపులి పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించి నాలుగు రోజులు గడిచింది. పెద్దపులితో ప్రజలకు ..  వేటగాళ్లతో పెద్దపులికి నష్టం జరుగకుండ చూడవలసిన ఫారెస్ట్​ ఆఫీసర్లు అస్సలు పట్టించుకోకపోవడంతో అడవి గ్రామాల ప్రజలు అందోళన చెందుతున్నారు. ఫారెస్ట్​ ఆఫీసర్లు సరైన చర్యలు తీసుకోకపోవడంవల్లే సోమవారం ముత్తారం మండలంలోని మచ్చుపేటలో ఒక పశువుల మందపై దాడి చేసి ఒక ఆవును చంపింది. ఫారెస్ట్​ ఆఫీసర్లు ఒక్క పులే వచ్చిందంటుంటే ప్రత్యక్ష సాక్షి మాత్రం ఐదు పులులు వచ్చినట్లు చెబుతున్నారు.  పశువుల మందపై పులిదాడి చేసిన చోటును పెద్దపల్లి డీఎఫ్​ఓ రవి ప్రసాద్​,  ముత్తారం ఎస్సై నర్సింహారావు పరిశీలించారు. పులి సంచారంతో ముత్తారం మండలం  ఓడేడు, మచ్చుపేట, అడవిశ్రీరాంపూర్​, హరిపురం, ఖమ్మంపల్లి, సీతంపల్లి, కేశనపల్లి, దర్వాపూర్, లక్కారం మైదంబండలతోపాటు  కాల్వశ్రీరాంపూర్​ మండలంలోని ఇదులాపూర్​, జాఫర్​ఖాన్​పేట, వెన్నంపల్లి, రామగిరి మండలంలోని బేగంపేట, లద్నాపూర్​, రామయ్యపల్లి గ్రామాల ప్రజలు అందోళన చెందుతున్నారు.

చత్తీస్​ఘడ్​ అడవుల నుంచి జూన్​లో ఒక పెద్దపులి భూపాలపల్లి జిల్లాలోప్రవేశించినట్లు ఫారెస్ట్​ అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి చిట్యాల దగ్గర మానేరు నది దాటి పెద్దపల్లి జిల్లా ముత్తారం ఓడేడు గ్రామ శివారులో వచ్చినట్టు రైతులు గుర్తించి పారెస్ట్​ ఆఫీసర్లకు సమాచారమిచ్చారు. నాలుగు రోజుల కిందట సమాచారం ఇచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంవల్లనే  మచ్చుపేట పశువుల కాపరి  కార్కురి రాజయ్య ఆవుల మందపై  దాడి చేసింది. సమాచారం రాగానే  పులి ఎటు నుంచి ఎటు వెళ్తుందని తెలుసుకునేందుకు టీమ్​ను ఏర్పాటు చేయాలి. వేటగాళ్ల ఉచ్చులకు పులి బలికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమీప గ్రామాలనుంచి పశువులు అడవిలోకి మేతకు తీసుకువెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  పులి సంచరించే చోట్ల హెచ్చరిక బోర్డులు పెట్టాలి. వాటి సంచారాన్ని గుర్తించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అయితే జిల్లా ఫారెస్టు అధికారులు ఇవేవీ పట్టించుకోలేదు. వారి దగ్గర ఇందుకు సంబంధించి ఏలాంటి యాక్షన్​ ఫ్లాన్​లేదు. గతంలో ఇలా దారి తప్పి వచ్చిన పులులు మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లాలో వేటగాళ్ల ఉచ్చులోకి చిక్కిన సందర్బాలు ఉన్నాయి.

ఐదు పులులు  వచ్చాయి..

సోమవారం ఉద యం మచ్చుపేట శివారులో బగుళ్లగుట్టపైకి ఆవులను మేపడానికి వెళ్లానని,  ఆవుల మందపై ఒక్కసారి ఐదు పులులు దాడిచేశాయని పశువుల కాపారి  కార్కురి రాజయ్య  తెలిపారు. నాలుగు పెద్దగా ఉన్నాయన్నారు. తాను భయంతో అరిచానని, పులులు ఒక్క ఆవుపై పడి చంపాయని చెప్పారు.

‑ కాక్కురి రాజయ్య, ప్రత్యక్ష సాక్షి..