
కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో పది రోజులుగా పెద్దపులి హడలెత్తిస్తోంది. వరుసగా పశువులపై దాడులు చేస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా అందేరి టైగర్ రిజర్వ్ నుంచి పులులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఇటికెల పహాడ్–నవేగాం గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఆవును పులి చంపేసింది.
నాలుగు రోజుల క్రితం కాగజ్ నగర్ రేంజ్ లోని ఈస్ గాం బీట్ లో పులి దాడిలో మృతిచెందిన పశువు కళేబరాన్ని అధికారులు గుర్తించారు. పెంచికల్ పేట్ రేంజ్ లోనూ పులి చేతిలో లేగదూడ హతమైంది. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను ట్రాకింగ్ చేస్తున్నారు. సిర్పూర్ టీ రేంజ్, కాగజ్ నగర్ రేంజ్ మధ్య పులి తిరుగుతున్నట్లు అంచనాకు వచ్చారు.