నల్లమలలో పులులు పెరుగుతున్నయ్.. కవ్వాల్లో తగ్గుతున్నయ్

నల్లమలలో పులులు పెరుగుతున్నయ్..  కవ్వాల్లో తగ్గుతున్నయ్

 

  • రాష్ట్రంలో పులులకు సేఫ్​జోన్​గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
  • బేస్ క్యాంప్ మానిటరింగ్​తో సత్ఫలితాలు
  • కవ్వాల్​లో ఎప్పట్లాగే డేంజర్​బెల్స్

అమ్రాబాద్/మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం ఇటు నల్లమలలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉండగా.. రెండింటిలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. నల్లమలలో తీసుకుంటున్న చర్యల ద్వారా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పులులకు సేఫ్​జోన్​గా మారితే, కవ్వాల్ మాత్రం పులులకు డేంజర్​బెల్స్ మోగిస్తున్నది. ఆక్రమణల కారణంగా కవ్వాల్ టైగర్​ రిజర్వ్​ఫారెస్ట్ పలుచబడడం, స్థానికుల సహకారం అంతగా లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులు ఇక్కడ ఉండడంలేదు. అడపాదడపా ఉంటున్న పులులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. ఫలితంగా అమ్రాబాద్ టైగర్ ​రిజర్వ్​36 పులులతో కళకళలాడుతుండగా, కవ్వాల పులులు లేక వెలవెలబోతున్నది.

అమ్రాబాద్​లో సత్ఫలితాలనిస్తున్న ప్రాజెక్ట్ టైగర్..

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్​)లోని ప్రాజెక్ట్ సత్ఫలితాలు ఇస్తున్నది. ఏటా పెరుగుతున్న పులుల సంఖ్యే ఇందుకు నిదర్శనం.  తెలంగాణలోని నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలోని నల్లమల కొండల నడుమ 2,611.4 చ.కిమీ. (కోర్ ఏరియా 2,166.37 చ.కిమీ, బఫర్ ఏరియా 445.03 చ.కిమీ) అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. ఈ రిజర్వ్ లో అమ్రాబాద్, అచ్చంపేట, నాగార్జున సాగర్ డివిజన్లు ఉన్నాయి. 2024–-25లో ఫారెస్ట్ శాఖ నిర్వహించిన జంతుగణనలో  13 మగ పులులు, 20 ఆడ పులులు, మరో 3 లింగ నిర్ధారణ కాని పులి కూనలతో మొత్తం 36 పెద్దపులులు ఉన్నట్లు తేలింది. ఏటీఆర్​లో 524 కెమెరాలు ఏర్పాటు చేసి పులుల  కదలికలను  పర్యవేక్షిస్తున్నారు. లైవ్ కెమెరా మానిటరింగ్, డ్రోన్ కెమెరాల  నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. 29 బేస్ క్యాంపుల్లో 145 మంది స్థానిక యువతను నియమించి మానిటరింగ్ వ్యవస్థను పటిష్టం చేశారు. రోజూ కెమెరాల చిప్స్ సేకరించడం, మార్గమధ్యలో జంతువుల అవశేషాలు, విసర్జకాలు, పాదముద్రలు సేకరించి వాటిని మన్ననూరు బయో ల్యాబ్ కు పంపడం, వేటగాళ్లు, స్మగ్లర్ల కదలికలుంటే  అధికారులను అప్రమత్తం చేయడం వీరి విధి. వీరు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ద్వారా అందించిన ఎం–స్క్రిప్ట్ మొబైల్ అప్లికేషన్‌‌తో ఎప్పటికప్పుడు అడవిలోని కార్యకలాపాలు, జంతువుల కదలికలు, విసర్జకాలు, పాదముద్రలు, అజ్ఞాత వ్యక్తుల కదలికలను అప్​లోడ్ చేస్తారు.

 పెద్దపులులు వృద్ధి చెందడానికి వాటి ఆహారం కోసం జింకలు తదితర వన్యప్రాణుల సంతతిని పెంచేందుకు ఏటీఆర్ పరిధిలో సాంపన్ పడేల్, గార్ల బోర్డు, రోళ్లబండ, ఈర్ల పడేల్​లో   గడ్డి క్షేత్రాలను పెంచుతున్నారు. వేటగాళ్లు, స్మగ్లర్లపై నిరంతర నిఘా కొనసాగుతున్నది. ఇందుకోసం 4 అంచెల పెట్రోలింగ్ వ్యవస్థ పని చేస్తున్నది. నిరంతర గస్తీ కోసం బోట్‌‌ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. హైవే పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఏటీఆర్​లో మొదట 17 పులులుండగా క్రమంగా పెరుగుతున్నాయి. నాలుగేళ్లకు ఒక సారి టైగర్ సెన్సెస్ నిర్వహిస్తారు. ప్రస్తుతం 36 పులులు ఉన్నట్లు అధికారులు ఫేజ్ 4 సర్వే ఆధారంగా గుర్తించారు. పులుల సంఖ్య పెరగడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు ఏటీఆర్ సందర్శనకు వస్తున్నారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇప్పటికే సుమారు 250 మందిని  వాచర్లుగా నియమించి ప్రతి నెలా రూ.12 వేలు వేతనం అందిస్తున్నారు. పరోక్షంగా కూడా చాలామందికి ఉపాధి లభిస్తున్నది.

కవ్వాల్ లో భిన్న పరిస్థితులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వులో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్ లో టైగర్ జోన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికి 13 ఏండ్లయినా ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదు. ఇక్కడ లక్ష ఎకరాలకు పైగా భూములు కబ్జాకు గురికావడం, పోడు వ్యవసాయం కారణంగా డీఫారెస్టేషన్, గిరిజనుల అలికిడి సమస్యగా మారింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా టైగర్ జోన్ల నుంచి పెద్ద పులులు ఆహారం, ఆవాసం వెతుక్కుంటూ కవ్వాల్  వైపు వస్తున్నా అనువైన పరిస్థితులు లేకపోవడంతో వెనుదిరుగుతున్నాయి. ఇప్పటివరకు ఒక పులి కూడా ఆవాసం ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవు. ఇక బఫర్ జోన్ 1,100పై చిలుకు చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. 

తడోబా నుంచి వలస వస్తున్న పులులు బఫర్ జోన్ పరిధిలోని కాగజ్​నగర్ అడవుల్లోనే మకాం వేస్తున్నాయి. కోర్ ఏరియాలో విపరీతమైన అలికిడి ఉండడం వల్ల పెద్ద పులులు ఇక్కడికి వచ్చినప్పటికీ ఆగటం లేదని తెలుస్తున్నది. అటవీ గ్రామాలను తరలించడమే దీనికి పరిష్కారంగా భావించిన ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే కడెం మండలంలోని 2 గ్రామాలను రీ లొకేషన్ చేశారు. జన్నారం మండలంలోని మరో 2 గ్రామాలను తరలించడానికి చర్యలు చర్యలు తీసుకుంటున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ పరిధిలోని మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం 5 నుంచి 6 పులులు సంచరిస్తున్నట్టు సమాచారం. మంచిర్యాల జిల్లాలోని ర్యాలీ అడవుల్లోకి నిరుడు డిసెంబర్ 17న వచ్చిన ఫిమేల్ టైగర్ ఇదే ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుంది. అలాగే ఇటీవల ఆసిఫాబాద్ వైపు నుంచి మరో పులి కాసిపేట మండల అడవుల్లోకి వచ్చింది. ఇవి కాకుండా కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో మరో 4, 5 పులులు ఉన్నట్టు ఫారెస్ట్ వర్గాల సమాచారం. కాగజ్ నగర్ అడవుల్లోకి మొదటిసారిగా 2013లో ఫాల్గుణ అనే ఫిమేల్ టైగర్ వచ్చింది. అది ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకుని రెండు ఈతల్లో 8 పిల్లలను పెట్టింది. అప్పటినుంచి ఈ ప్రాంతంలో పులుల సందడి పెరిగింది. 

ఆదిలాబాద్, నిర్మల్​, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పులుల ఆనవాళ్లు

ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, నిర్మల్ జిల్లాలోని పెంబి, మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్, కాసిపేట, లక్షేట్టిపేట, చెన్నూరు, కోటపల్లి, బెల్లంపల్లి మండలాల్లో, ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ కాగజ్​నగర్ ఫారెస్ట్ డివిజన్లో పులుల ఆనవాళ్లు తరచూ కనిపిస్తున్నాయి. గత పదేండ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 8 పులులు చనిపోయాయి. వీటిలో ఆరు పులులు వేటగాళ్ల ఉచ్చులో చిక్కి హతమైనట్టు తేలింది. ఈ మధ్యకాలంలోనే ఆసిఫాబాద్ జిల్లాలో ఒక పులి టెరిటోరియల్ ఫైట్ లో మరణించగా, మరో పులిపై విషప్రయోగం జరిగినట్టు గుర్తించారు. 2016 నుంచి 2020 మధ్య మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, జైపూర్, బెల్లంపల్లి మండలాల్లో మరో మూడు టైగర్స్ ను వేటగాళ్లు హతమార్చారు. చెన్నూరు ప్రాంతంలో సంచరించిన మరో  కే4 అనే ఫిమేల్ టైగర్ నాలుగేళ్లుగా కనిపించకుండా పోయింది.