ఆ నాలుగు పులులు ఎక్కడ.. బతికే ఉన్నయా? వేటగాళ్ల విషప్రయోగానికి బలయ్యాయా?

ఆ నాలుగు పులులు ఎక్కడ.. బతికే ఉన్నయా? వేటగాళ్ల విషప్రయోగానికి బలయ్యాయా?
  • కాగజ్ నగర్ ఫారెస్ట్ లో టైగర్ 
  • ఫ్యామిలీకి ఆపద.. నాలుగు పిల్లలతో కలిసి జీవిస్తున్న రెండు పెద్ద పులులు
  • వీటిలో ఇప్పటికే మగ పులి, ఓ పిల్ల మృతి
  • తల్లి, మూడు పిల్లల కోసం సెర్చ్ ఆపరేషన్
  • 70 మంది సిబ్బందితో అడవిని జల్లెడ పడ్తున్న ఫారెస్ట్​ ఆఫీసర్లు 
  • విషప్రయోగం జరిగిన పశువు కళేబరాన్ని 
  • ఎన్ని పులులు తిన్నాయనే దానిపై నో క్లారిటీ 

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ లో రెండు పులులు మృతి చెందిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. చనిపోయినవి ఒంటరి పులులు కావని, అవి ఒకే ఫ్యామిలీకి చెందినవని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఒక మగ పులి, ఆడ పులి తమ నాలుగు పిల్లలతో కాగజ్ నగర్ అడవిలో ఆవాసం ఏర్పాటు చేసుకోగా.. వాటిలో మగ పులి, ఓ కూన మృతి చెందాయి. ఈ నేపథ్యంలో తల్లి పులి, మూడు పిల్లల పరిస్థితి ఏంటన్నది అంతుచిక్కడం లేదు. 

నాలుగు రోజులుగా కాగజ్ నగర్ రేంజ్ పరిధిలో ఫారెస్ట్​ఆఫీసర్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 70 మంది అటవీ సిబ్బంది పులుల జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. కానీ ఇప్పటివరకు వాటి జాడ దొరకలేదు. సీసీ కెమెరాల్లోనూ పులుల ఆనవాళ్లు కనిపించకపోవడంతో అవి బతికే ఉన్నాయా? లేదంటే వేటగాళ్ల విషప్రయోగానికి అవి కూడా బలయ్యాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

రెండేండ్ల కింద అతిథిగా వచ్చినయ్..

దట్టమైన అడవి, పుష్కలమైన నీటి వనరులు ఉన్న కాగజ్​నగర్​ ఫారెస్ట్​ పులుల పునరుత్పత్తికి అనుకూలంగా ఉంది. ఇది మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​కు ఆనుకొని ఉండడంతో అక్కడి పులులు ఇక్కడికొచ్చి పిల్లలను కంటున్నాయి. ఇలాగే రెండేండ్ల కింద ఎస్–8 అనే ఆడపులి, ఎస్–9 అనే మగ పులి కాగజ్ నగర్ కు వచ్చి స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఎస్–8నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో రెండు ఆడ, రెండు మగ పిల్లలు ఉన్నాయి. 

ఈ టైగర్​ఫ్యామిలీ రెండేండ్లుగా కాగజ్​నగర్ అడవిని​ఆవాసంగా మార్చుకుని, ఇక్కడే ఉంటున్నాయి. అయితే అనుకోని రీతిలో మగ పులి, ఓ పిల్ల చనిపోయాయి. శనివారం దరిగాం ఏరియాలో పులి పిల్ల కళేబరం దొరకగా, సోమవారం మగ పులి కళేబరం దొరికింది. కొట్లాటలో పులి పిల్ల చనిపోయిందని మొదట అధికారులు చెప్పినప్పటికీ.. మగ పులికి ఉచ్చు బిగిసి ఉండడం, విషప్రయోగం జరిగినట్లు తేలడంతో వేటగాళ్ల పనిగా స్పష్టమైంది. దీంతో ఈ విషాదం ఈ రెండు మరణాలతోనే ఆగుతుందా? సంఖ్య ఇంకా పెరుగుతుందా అన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.  

కొనసాగుతున్న సెర్చ్​ఆపరేషన్..​

పులుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా కవ్వాల్ ను టైగర్​జోన్​గా ఏర్పాటు చేయడంతో పాటు కాగజ్​నగర్​డివిజన్​ను టైగర్​కారిడార్​గా ప్రకటించాయి. ఇక్కడ సిబ్బందిని పెంచి, అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులుల కదలికలను ట్రాక్​చేసే పద్ధతి అమలువుతోంది. ఇలాంటి టైమ్ లో వేటగాళ్ల ఉచ్చు, విషప్రయోగానికి రెండు పులులు బలికావడంతో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సీరియస్ అయినట్లు తెలిసింది. అథారిటీకి అనుసంధానంగా ఉన్న హైటికోస్ సంస్థ ప్రతినిధుల ద్వారా పూర్తి నివేదిక కోరినట్లు సమాచారం. 

ఈ క్రమంలో రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు. 70 మంది సిబ్బందితో కలిసి మిగిలిన నాలుగు పులల జాడ కనిపెట్టేందుకు అడవిలో అంగుళం అంగుళం గాలిస్తున్నారు. పెద్ద పులి దాడి చేసి హతమార్చిన పశువు కళేబరం మీద విషప్రయోగం జరిగినట్లు తెలుస్తుండగా.. ఈ కళేబరాన్ని మూడు పులులు తిన్నాయని ఫారెస్ట్ ఆఫీసర్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు తెలుస్తోంది. వీటిలో ఇప్పటికే రెండు మృతి చెందగా మరో పులి ఏమైందో తెలియడం లేదు. ఆ కళేబరాన్ని మూడు పులులే తిన్నాయా? మొత్తం ఆరు తిన్నాయా? అనే విషయంలోనూ స్పష్టత లేదు. 

అటవీ శాఖ చీఫ్ డోబ్రియాల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పర్గేయిన్ సహా ఇతర అధికారులు పులి మృతి చెందిన స్పాట్ ను పరిశీలించి అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది బాధ్యతారాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘‘కళేబరం తిన్న మూడో పులి  జాడ రెండు రోజుల్లో కనుక్కొని నాకు వివరాలు అందించాలి. బతికుంటే దాని లైవ్ ఫొటోగ్రాఫ్, చనిపోతే దాని కళేబరం వెతికి చూపించాలి. లేదంటే చర్యలు తప్పవు” అని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే  విధుల్లో నిర్లక్ష్యం వహించిన డజను మంది అధికారులు, సిబ్బంది మీద వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి  సైతం ప్రాథమిక నివేదిక అందించినట్లు తెలుస్తోంది.