పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో పెద్దపులుల కలకలం

పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో పెద్దపులుల కలకలం
  •     పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓసీపీ 
  •     మట్టి డంప్‌ ఏరియాలో సంచారం 
  •     పాదముద్రలను గుర్తించి, ట్రాప్ కెమెరాలు పెట్టిన ఫారెస్ట్ ఆఫీసర్లు  


గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో మూసివేసిన మేడిపల్లి ఓపెన్​కాస్ట్​ప్రాజెక్ట్​మట్టి డంప్​ఏరియాలో పెద్దపులి సంచరిస్తోంది. సోమవారం లింగాపూర్ ​పంప్​హౌస్​కు వెళ్లే దారిలో పులి పాదముద్రలను ఫారెస్ట్ ఆఫీసర్లు సేకరించారు. పాములపేట, లింగాపూర్, మేడిపల్లి ప్రాంతాల్లోనే పులి సంచరిస్తున్నట్టు భావించి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చెన్నూర్​ రేంజ్​యానిమల్​ట్రాకర్లను రప్పించి నిఘా పెట్టించారు. పెద్దపులి సంచారంతో ఓసీపీ చుట్టు పక్కల మేడిపల్లి, లింగాపూర్​, పాములపేట తదితర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.  

మేడిపల్లి ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్ట్​కు చెందిన 2,163 ఎకరాల్లో సింగరేణి అటవీ శాఖ మొక్కలను పెంచడంతో అడవిగా మారింది. అందులో పందులు, జింకలు, నెమళ్లు, కుందేళ్లు, పాములు, ముంగీసలు వంటి వివిధ రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. కాళేశ్వరం సర్కిల్​ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్, ఐఎఫ్ఎస్​ బి.ప్రభాకర్​ మేడిపల్లి ఓసీపీని సందర్శించి పెద్దపులి పాద ముద్రలను పరిశీలించారు.  మహారాష్ట్రలోని తడోబా నుంచి ఆదిలాబాద్​అడవులు దాటి ఇటువైపు పులి వచ్చి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఆడపులితో మేటింగ్​కోసం వెతుకుతూ వచ్చి ఉండొచ్చన్నారు.  పెద్దపులి ఒంటరిగా తిరుగుతుందని ఎలాంటి హాని తలపెట్టొద్దని, ఎలా వచ్చిందో అలాగే వెళ్లిపోతుందని, రాత్రి పూట ఓసీపీ చుట్టు పక్కల ప్రాంతాల  ప్రజలు, రైతులు బయట తిరగొద్దని, అప్రమత్తంగా ఉండాలని, పొలాల వద్ద -3 ఫేస్​ కరెంట్​ను వాడొద్దని అధికారులు సూచించారు.  పులి జాడ తెలిస్తే  వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. పెద్దపల్లి డీఎఫ్​ఓ సీహెచ్​శివయ్య, ఎఫ్​ఆర్ఓ టి.సతీశ్ కుమార్, స్ట్రైక్​ ఫోర్స్​ఎఫ్ఆర్​ఓ ఎంవీ నాయక్​, డిప్యూటీ రేంజ్​ఆఫీసర్​ జి.కొమురయ్య, స్ట్రైక్​ ఫోర్స్​సెక్షన్​ ఆఫీసర్​ఎస్​డీ రహమతుల్లా, హెచ్.మంగీలాల్​, స్రవంతి, 
జి.రామ్మూర్తి ఉన్నారు. 

కామారెడ్డి జిల్లా అంబారీపేటలో కదలికలు  

కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం రేపింది. తాజాగా.. రెండు రోజుల కింద దోమకొండ మండలం అంబారీపేటకు చెందిన స్వామిగౌడ్​తన వ్యవసాయ పొలం వద్ద పశువులను కట్టేశాడు. అందులోని లేగ దూడలను పులి చంపడంతో ఫారెస్టు అధికారులు సమాచారం ఇచ్చాడు. ఆదివారం రాత్రి ట్రాప్  కెమెరాలు ఏర్పాటు చేయగా పులి జాడ రికార్డైంది. సోమవారం అధికారులు వెళ్లి పులి పాద ముద్రలను సేకరించారు. అంబారీపేటతో పాటు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంచిర్యాల జిల్లా నుంచి పులి వచ్చినట్లు కామారెడ్డి జిల్లా ఫారెస్టు అధికారి నిఖిత తెలిపారు. గత జులైలో రామారెడ్డి మండలంలో సంచరించిన పులి,  ప్రస్తుతం దోమకొండ మండలంలో  సంచరించే పులి ఒకటి కాదని పేర్కొన్నారు.