రైతు సమస్యలను చర్చలతో తేలుస్తారా?.. బుల్లెట్లతోనా?

రైతు సమస్యలను చర్చలతో తేలుస్తారా?.. బుల్లెట్లతోనా?

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు దేశ రాజధానిలో నిరసనలను కొనసాగుతున్నాయి. రైతు సంఘాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ అవి కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలో తమ సమస్యలను సాధ్యమైనంత త్వరగా కేంద్రం పరిష్కరించాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ అన్నారు. అగ్రి చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు చర్చల ద్వారా ముగింపు పలకాలని కోరారు. ఒకవేళ కుదరకపోతే బుల్లెట్లతోనైనా పరిష్కారం చూపాలని మండిపడ్డారు. కేంద్రంతో చర్చలకు అన్నదాతలు రెడీగా ఉన్నారని, అయితే ఎలాంటి షరతులు లేకుండా చర్చలు నిర్వహించాలని స్పష్టం చేశారు. 

‘మేం చర్చలకు రావాలని అంటూనే కేంద్రం పలు షరతులు పెడుతోంది. సాగు చట్టాలను సవరిస్తామని అంటోంది. కానీ చట్టాలను వెనక్కి తీసుకుంటామని హామీ ఇవ్వడం లేదు. ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించడానికా రైతులు 8 నెలలుగా నిరసనలు చేస్తోంది? ప్రభుత్వం మాట్లాడాలనుకుంటే ఎలాంటి కండీషన్లు లేకుండా చర్చలు జరపాలి’ అని తికాయత్ పేర్కొన్నారు. రైతులు నిరసనలను ముగించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరిన నేపథ్యంలో తికాయత్ పైవ్యాఖ్యలు చేశారు.