
దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్ కు ముందు సౌత్ జోన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు నుంచి కెప్టెన్ తిలక్ వర్మతో పాటు స్పిన్ ఆల్ రౌండర్ సాయి కిషోర్ టోర్నీలో మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యారు. దీంతో నార్త్ జోన్‌తో జరగబోయే కీలకమైన సెమీ ఫైనల్ కు వీరి సేవలు లేకుండానే సౌత్ జోన్ మ్యాచ్ ఆడనుంది. కెప్టెన్ గా తిలక్ వర్మ జట్టులో కీలక బ్యాటర్ కాగా.. స్పిన్ ఆల్ రౌండర్ సాయి కిషోర్ ఆ జట్టులో మరో కీలక ప్లేయర్. వీరిద్దరూ లేకపోవడంతో జట్టు బలహీనంగా మారనుంది. దులీప్ ట్రోఫీ నుంచి వీరిద్దరూ ఎందుకు వైదొలిగారో ఇప్పుడు చూద్దాం..
ఆసియా కప్ కు తిలక్ వర్మ:
తెలుగు క్రికెటర్ తిలంక వర్మ దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ కు కెప్టెన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆసియా కప్ కు ఎంపిక కావడంతో దులీప్ ట్రోఫీలోని మిగిలిన మ్యాచ్ లకు తిలక్ వర్మ దూరం కావాల్సి వచ్చింది. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు సెప్టెంబర్ 4 లేదా 5 న దుబాయ్ కి వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో దులీప్ ట్రోఫి సెమీ ఫైనల్స్ జరగనుంది. ఈ కారణంగా తిలక్ దులీప్ ట్రోఫీకి అందుబాటులో ఉండడం లేదు.
తిలక్ స్థానంలో కేరళ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ అజారుద్దీన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. తమిళనాడు బ్యాటర్ ఎన్ జగదీశన్ వైస్-కెప్టెన్సీ చేయనున్నాడు. తిలక్ స్థానంలో పుదుచ్చేరి ఆల్ రౌండర్ అంకిత్ శర్మను ఎంపిక చేశారు. 2024-25 రంజీ ట్రోఫీ సీజన్‌లో అంకిత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో తన జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో రెండో స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ లోనూ రాణించి 216 పరుగులు చేశాడు.
సాయి కిషోర్ కు గాయం:
టోర్నీ ప్రారంభానికి ముందే సాయి కిషోర్ కు గాయమైంది. ఫస్ట్ డివిజన్ క్లబ్ మ్యాచ్‌లో చేతి వేలి గాయం కారణంగా సాయి కిషోర్ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో దులీప్ ట్రోఫికి ముందు ప్రారంభమైన బుచ్చిబాబు టోర్నమెంట్‌కు ఈ తమిళనాడు స్పిన్నర్ దూరంగా ఉన్నాడు. సెమీ ఫైనల్ సమయానికి కోలుకుంటాడని భావించినా అతను పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోయాడు. దీంతో దులీప్ ట్రోఫీలోని మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యాడు. సాయి కిషోర్ స్థానంలో ఆంధ్రా బ్యాటర్ షేక్ రషీద్ ను ఎంపిక చేసింది. గత సీజన్ లో రషీద్ 12 ఇన్నింగ్స్‌లలో 627 పరుగులు చేసి రంజీ ట్రోఫీలో ఆంధ్రా జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.