న్యూఢిల్లీ: యాపిల్ సీఈఓ టిమ్ కుక్, షూ కంపెనీ నైకీలో తన వాటాను పెంచుకున్నారు. తాజాగా 50 వేల క్లాస్ బీ షేర్లను 58.97 డాలర్ల సగటు షేరు ధరకు కొనుగోలు చేశారు. మొత్తం విలువ దాదాపు 3 మిలియన్ డాలర్లు (రూ.26.7 కోట్లు). నైకీలో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా, కాంపన్సేషన్ కమిటీ చైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు. తాజా లావాదేవీతో కుక్ వద్ద ఉన్న నైకీ షేర్ల సంఖ్య 1,05,480కి చేరింది. ఈ షూ కంపెనీ ఇటీవల కాలంలో ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో టిమ్ వాటాలు పెంచుకోవడం ఇన్వెస్టర్ల ఆసక్తి పెంచింది. మరోవైపు నైకీ డైరెక్టర్, మాజీ ఇంటెల్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ స్వాన్ కూడా 8,691 షేర్లను 57.54 డాలర్ల సగటు షేరు ధరకు కొనుగోలు చేశారు. నైకీ షేర్ బుధవారం 57.34 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ క్వార్టర్ ఫలితాలు అంచనాలను మించాయి కానీ హాలిడే పీరియడ్‌లో రెవెన్యూ తగ్గొచ్చని, చైనాలో డిమాండ్ బలహీనంగా ఉందని ఎనలిస్టులు పేర్కొన్నారు.
