అటవీ శాఖలో కలప దొంగలు..అక్రమ రవాణా.. ఖమ్మం డీఎఫ్ వో ఆధ్వర్యంలో ఎంక్వైరీ

అటవీ శాఖలో కలప దొంగలు..అక్రమ రవాణా.. ఖమ్మం డీఎఫ్ వో ఆధ్వర్యంలో ఎంక్వైరీ
  • దరఖాస్తులో సర్కారీ తుమ్మగా పేర్కొని సండ్ర కలప తరలింపు 
  • ఎన్​వోసీ ట్యాంపరింగ్ చేసిన శాఖలోని కొందరు అక్రమార్కులు
  • బీట్ ఆఫీసర్ సస్పెన్షన్ , మరికొందరు ఆఫీసర్లపైనా అనుమానాలు 
  • డీఎఫ్ వో నేతృత్వంలో ఎంక్వైరీ చేపట్టిన టాస్క్​ ఫోర్స్​ రేంజ్ టీమ్

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా అటవీ శాఖలో ఇంటి దొంగలు పడ్డారు.  కలప అక్రమ రవాణాలో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ​సిద్ధార్థ్ విక్రమ్ ​సింగ్ నేతృత్వంలో టాస్క్​ ఫోర్స్ ​రేంజ్​ఆఫీసర్లు దర్యాప్తు చేపట్టారు.  చింతకాని మండలం నుంచి సర్కారు తుమ్మ కలప తరలించేందుకు ముందుగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) తీసుకుని, అనంతరం సూర్యాపేట, మహబూబాబాద్ ​జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో నరికిన సండ్ర కలప(ఖైర్)ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు బహిర్గతమైంది. 

ఎలాంటి ఫీల్డ్ వెరిఫికేషన్​  లేకుండా, వాల్టా ఫీజు వసూలు చేయకుండా, నేషనల్ ట్రాన్సిట్ పాస్ ​సిస్టమ్(ఎన్​టీపీఎస్) ద్వారా ఆన్​లైన్ లో ఎన్​వోసీలను జారీ చేసినట్టు ఉన్నతాధికారు లు గుర్తించారు. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తులో భాగంగా చింతకాని ఫారెస్ట్ బీట్​ఆఫీసర్​ శ్రీకాంత్ ను సస్పెండ్​ చేశారు. అయితే పర్మిట్ల జారీ ప్రక్రియ అంతా డీఆర్వో, ఎఫ్ఆర్వో పరిధిలోనే ఉండి, ఆన్ లైన్ లో లాగిన్ అయిన తర్వాత పూర్తి అనుమతితోనే బయటకు వస్తుంది. 

 కానీ,  పై స్థాయిలోని ఒకరిద్దరిని తప్పిస్తూ, బీట్ ఆఫీసర్ ఒక్కరినే బలి చేస్తున్నారనే చర్చ డిపార్ట్ మెంట్ లో జరుగుతోంది. ఇంతకు ముందు అక్రమాలు జరిగితే అప్పటి డీఆర్వో లక్ష్మిపతిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు అదే స్థాయి అధికారిపై  ఎందుకు వెనుకాడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

దసరా రోజు మందు పార్టీ..! 

అటవీ శాఖలోని అక్రమాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన అధికారి ఒకరు తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు దసరా రోజు మందు పార్టీ ఇచ్చినట్టు సమాచారం.  ఖమ్మం అర్బన్​ మండలం పుట్టకోటలోని  ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద  జరిగిన పార్టీలో  బీట్​ ఆఫీసర్​తో పాటు టాస్క్ ఫోర్స్​సెక్షన్ ఆఫీసర్ ​ఒకరు, ముగ్గురు వాచర్లు పాల్గొనట్టు తెలిసింది.  

ప్రస్తుతం సస్పెండైన శ్రీకాంత్ తో కలిసి పార్టీ ఏర్పాటు చేసిన ఆఫీసర్ కూడా గతంలో టాస్క్ ఫోర్స్ లో ఒకే చోట పనిచేశారు. కలప స్మగ్లర్లతో ఉన్న పాత పరిచయాలను వినియోగించుకుని ‘మామూళ్లు’ తీసుకొని  అక్రమాలకు సహకరిస్తున్నారని తెలుస్తోంది. తమ చేతులకు మట్టి అంటకుండా వేరొక వ్యక్తి (రవికుమార్) పేరుతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మామూళ్లు వసూలు చేసినట్టు విచారణ అధికారులు గుర్తించారు. ఇప్పటికే  మొబైల్ ను సీజ్ చేశారు. అందులోని డేటాను చెక్ చేస్తే ఎవరెవరికి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి, ఎవరెవరి ప్రమేయముందో తేలడంతో పాటు మరెన్నో అక్రమాలు బయటకు వస్తాయి.  

 అక్రమాలు జరిగిందిలా..! 

కలప అక్రమ రవాణాలో సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన ఓ స్మగ్లర్​ కీలక సూత్రధారిగా ఉన్నారు. అతను సూర్యాపేట, మహబూబాబాద్ ​జిల్లాల్లోని ప్రైవేట్ భూముల్లోని సండ్ర చెట్లను నరికి, వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ఫారెస్ట్ సిబ్బంది సాయంతో ఫేక్​ ఎన్​వోసీలను తయారు చేయించారు.  చింతకాని మండలం నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ కు సర్కారీ తుమ్మ కలపను తరలించేందుకు అక్కడి బీట్​ఆఫీసర్​ శ్రీకాంత్ సాయంతో నేషనల్ ట్రాన్సిట్ పాస్​ సిస్టమ్ ​ద్వారా ఎన్​వోసీలను తీసుకున్నారు.

 చింతకాని మండలంలో  సర్కారీ తుమ్మ చెట్లను నర కకుండానే ఇతర రాష్ట్రాలకు కలపను తరలించారు. ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద ఫేక్ ఎన్వోసీలను చూపిస్తూ, రూ.కోట్ల విలువైన కలపను దర్జాగా సరిహద్దులు దాటించారు. నకిలీ ఎన్​వోసీలతో సండ్ర కలపను తరలిస్తుండగా గత నెలలో మధ్యప్రదేశ్​లోని ఝబువా, అలీపూర్​ జిల్లాల్లో డివిజనల్ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నది తెలిసిందే.

విచారణ చేస్తున్నాం  

సండ్ర చెట్టు దుంగల అక్రమ రవాణాపై ఎంక్వైరీ  చేస్తున్నాం. ఆన్​ లైన్​లో జారీచేసిన ఎన్వోసీని ట్యాంపరింగ్ చేసి, విలువైన కలపను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. డిపార్ట్ మెంట్ సిబ్బంది ప్రమేయంపైనా విచారణ కొనసాగిస్తున్నాం.  చర్యల కోసం రాష్ట్ర, సర్కిల్ ఆఫీసులకు రిపోర్ట్ పంపించాం. ఎన్​వోసీల దుర్వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తాం. ఆర్నెళ్లలో ఎక్కడెక్కడ నుంచి ఎన్వోసీలు ఇష్యూ అయిందనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. చట్టవిరుద్ధ పనుల్లో పాల్గొన్న అధికారులు, వ్యక్తులపైనా క్రిమినల్ చర్యలు ఉంటాయి. 

- సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఖమ్మం డీఎఫ్ వో-

పాన్​ మసాలాల్లో సండ్ర కలప! 

గుట్కా వంటి పాన్​మసాలాల తయారీలో, పాన్​లో ఉపయోగించే కత్తా తయారీలో సండ్ర కలపను వినియోగిస్తారని అధికారుల ఎంక్వైరీలో తేలింది. మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాలో ఇలాంటి పరిశ్రమలు ఉండగా.. అక్కడ కలపకు విపరీతమైన డిమాండ్​ ఉంది. దీంతో తెలంగాణ జిల్లాల్లోని విలువైన సండ్ర కలపను తరలించేందుకు ఫేక్​ఎన్వోసీ రూట్ ను స్మగ్లర్లు ఎంచుకున్నారు. కలప డీలర్లు, కొందరు ప్రైవేట్ ఏజెంట్లు కలిసి కొన్నాళ్లుగా జిల్లా కేంద్రంగా దందాను నడిపిస్తున్నారు.

 ఆన్​ లైన్​ లో తప్పుడు వివరాలు నమోదు చేసి, బీట్​ ఆఫీసర్​ శ్రీకాంత్ సపోర్ట్ తో మొత్తం 24 ఎన్​వోసీలను తీసుకున్నట్టు ఎంక్వైరీలో గుర్తించారు. వారం రోజుల కింద ఫేక్ ఎన్వోసీతో కలప తరలించే లారీని మహబూబాబాద్ జిల్లాలో అక్కడి ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. ఆన్​ లైన్​ పర్మిషన్ కోసం చూపించిన చింతకాని మండలంలో అడవులు లేకపోగా, ఆయా సర్వే నెంబర్లలో అసలు చెట్లే లేవని అధికారులు ఎంక్వైరీలో గుర్తించారు.