పోటాపోటీగా ఫ్రీ స్కీమ్ లు.. ఓటర్లను ఆకర్షించేందుకు లీడర్ల ఎత్తుగడలు

పోటాపోటీగా ఫ్రీ స్కీమ్ లు.. ఓటర్లను ఆకర్షించేందుకు లీడర్ల ఎత్తుగడలు

మెదక్, వెలుగు : ఎలక్షన్ల టైమ్ లో ఆయా రాజకీయ పార్టీలు స్కీమ్ లు ప్రకటించి ఓటరును ఆకర్షిస్తున్నారు.  మెదక్ నియోజకవర్గంలో ఎన్నికలు రాకముందే సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు  ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఫ్రీ స్కీమ్ లు అమలు చేస్తున్నారు. 

ఎమ్మెల్యే డ్రైవింగ్​ లైసెన్స్​మేళా..

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఫ్రీగా డ్రైవింగ్ లైసెన్స్ లు ఇప్పిస్తున్నారు. పది రోజుల పాటు ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో ఫ్రీ డ్రైవింగ్​ లైసెన్స్​ మేళా నిర్వహించారు. కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, మెదక్ పట్టణానికి చెందిన 11 వేల మందికి పైగా టూ, ఫోర్​ వీలర్​ డ్రైవింగ్​ లైసెన్స్​ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రోజూ కొందరికి స్లాట్​ లు బుక్​ చేస్తూ  లైసెన్స్​లు ఇప్పిస్తున్నారు. లైసెన్స్​లకు అవసరమైన ఫీజును ఎమ్మెల్యేనే చెల్లిస్తున్నారు. 

కాంగ్రెస్​ లీడర్​ఫ్రీ ఇన్సూరెన్స్​...

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ తరపున పోటీ చేయాలని ఆశిస్తున్న డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి డ్రైవర్ లకు ఫ్రీగా ఇన్సూరెన్స్ స్కీం  చేయిస్తున్నారు. నియోజవర్గ వ్యాప్తంగా డైవర్లు అందరికీ రూ.2 లక్ష విలువైన ప్రమాద బీమా చేయిస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రీమియంను తిరుపతి రెడ్డి చెల్లిస్తున్నారు. ప్రమాద బీమా కోసం మెదక్ పట్టణంలోని కాంగ్రెస్​ పార్టీ జిల్లా ఆఫీస్​లో దరఖాస్తు చేసుకునే ఏర్పాటు చేశారు. ఈ ఇన్సూరెన్స్​ స్కీం గురించి సోషల్​ 
మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో అర్హులైన  డ్రైవర్లు ఎందరు ఉన్నా వారందరికీ ఇన్సూరెన్స్​ చేయిస్తామని ప్రకటించారు.  

బోర్లు వేయిస్తున్న ‘మైనంపల్లి

రానున్న ఎన్నికల్లో మెదక్​ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని చూస్తున్న బీఆర్ఎస్​ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు కొడుకు డాక్టర్​ మైనంపల్లి రోహిత్ నియోజకవర్గ పరిధి  గ్రామాల్లో ఫ్రీగా బోర్లు వేయిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా ఒక రిగ్​ ​ మిషన్​ కొనుగోలు చేసినట్టు తెలిసింది.  గ్రామాల్లో, తండాల్లో ఎక్కడ అవసరం ఉందని చెప్పినా వెంటనే అక్కడ బోరు తవ్విస్తున్నారు. అలాగే ఫ్రీ మెడికల్​ క్యాంప్​ లు ఏర్పాటు చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఫ్రీగా మెడిసిన్​ లు అందజేయడంతో పాటు ఎవరికైనా ఆపరేషన్లు అవసరమైతే హైదరాబాద్  లోని  ప్రైవేట్ హాస్పిటళ్లకు తీసుకెళ్తున్నారు.  నిరుపేదలకు సొంత డబ్బులతో ఇళ్లు కూడా కట్టిస్తున్నారు. ఇలా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రకరకాలుగా  ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు విశ్వప్రయత్నాలు 
చేస్తున్నారు.